akula vijaya
-
‘ఖాకీ విడిచి.. గులాబీ చొక్కా వేసుకున్నట్లు ఉంది’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఆకుల విజయ మండిపడ్డారు. పోలీసుల తీరు ఖాకీ చొక్కాలా కాకుండా గులాబీ రంగు చొక్కా వేసుకున్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. నారాయణ కళాశాలలో బిడ్డ చనిపోయిన దు:ఖంలో ఉన్న తండ్రిని బూటు కాలితో తన్నడమేనా బంగారు తెలంగాణ అని ఆమె సూటిగా ప్రశ్నించారు. పోలీసుల తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులు.. టీఆర్ఎస్ నేతలకు సలాం చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో పోలీసుల తీరును ట్విట్టర్లో ప్రశ్నించిన కేటీఆర్‌కు తెలంగాణలో ఘటనలు కనిపించడం లేదా అని దుయ్యబట్టారు. ఆదిలాబాద్‌లో ఎస్సీ బిడ్డపై అఘాయిత్యం జరిగితే ఏం చర్యలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనేక మిస్సింగ్ కేసులు నమోదు అవుతున్నాయని..పోలీసులు ఏం చేస్తున్నారని ఆకుల విజయ మండిపడ్డారు. (విద్యార్థులపై పోలీసుల దాష్టీకం) మరోవైపు ఈ సంఘటనపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్విటర్లో స్పందించారు. ‘ఇది దురదృష్టకర జరిగిన సంఘటన. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను విధుల నుంచి తప్పించాం. వారిని హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీని ఆదేశించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. (నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: కేటీఆర్ స్పందన) -
నీకు మాత్రం పోలీస్ భద్రత ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిందని బీజేపీ మహిళ నాయకురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ నిర్భయ ఘటన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకురాలు డీకే అరుణ, మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, మహిళ మోర్చా నేతలు హాజరయ్యారు. ఓ వైపు మహిళా సాధికారత కోసం పరుగులు తీస్తుంటే మరోవైపు ఎందరో అమాయక మహిళలు బలైపోతున్నారని ఆందోళన చెందారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని, అన్ని రంగాల్లో వెక్కిలి మాటలు, వెర్రి చేష్టలు ఎక్కువయ్యయన్నారు. సంస్కారం నేర్పని చదువులు ఎందుకని నిలదీశారు. చదువు లేదనో, కులం తక్కువనో, వెనుకబడ్డ వారు అన్న ఉద్దేశ్యంతో ఇలాంటి ఘటనలు చేసిన వారిని పాపం అనకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది ఎవరైనా నిందితులకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. కొన్ని రోజులు బాధపడి ఆ తర్వాత తేలిగ్గా తీసుకోవడం సరికాదన్నారు. అలాగే.. దిశ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం, కనీసం పలకరించకపోవడం దారుణమన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని, హోంశాఖ మంత్రి మహ్మద్ అలీ వ్యాఖ్యలు దారుణమన్నారు. ఇంటికో పోలీస్‌ను పెట్టాలా అని తలసాని అంటున్నారు. నీ ఇంటి చుట్టూ అయితే 100 మంది పోలీసులు ఉండాలా అని ప్రశ్నించారు. అవసరం ఉన్న చోట ఒక్క పోలీసు కూడా ఉండరని విమర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరిక కూడా కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. ‘నిందితులకు శిక్ష పడాలి అంటే చేయాల్సింది ట్వీట్ కాదు. న్యాయం జరగాలి అంటే సమస్య తీవ్రత వివరించాలి’ అంటూ కేటీఆర్‌ను ఉద్ధేశించి హితవు పలికారు. వరంగల్‌లో జరిగిన న్యాయం చాలా రోజులు గుర్తున్నాయని ఆమె తెలిపారు. చట్టాలు సవరించాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రుల పెంపకంలోనూ మార్పు రావాలని డీకే ఆరుణ సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళ కమిషన్ లేకపోవడం దారుణమని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి మాట్లాడిన మాటలు సిగ్గుచేటని అన్నారు. చదవండి : ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్ అలీ మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి -
గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థికి తప్పిన ప్రమాదం
సాక్షి, గజ్వేల్ : గజ్వేల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల విజయ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. విజయ ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు తీవ్రంగా దెబ్బతింది. ప్రాణాపాయ స్థితి నుంచి ఆకుల విజయ తృటిలో తప్పించుకున్నారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌పై బీజేపీ తరపున ఆ పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలో దింపిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్‌పై బీజేపీ తరపున విజయ పోటీ చేసి ఓటమి చెందారు. -
బంగారు తెలంగాణ అంటూనే మహిళలకు అవమానం
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటూనే రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమాన పరుస్తోందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపడుచులకు గొప్ప పండుగ అని, అలాంటి పండుగ రోజున చార్మినార్‌లో బతుకమ్మ ఆడేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. బంగారు తెలంగాణ అంటూనే పండుగ రోజున మహిళలను అరెస్టు చేసి అవమానించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎంఐఎం జేబు రుమాలుగా ఎందుకు మారిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలు అంటే ఎందుకు అంత చిన్న చూపు అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేబినెట్లో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వకపోయినా ఊరుకున్నామని, కానీ పండుగ రోజున మహిళలను అవమానించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భారతీయ జన తా పార్టీ ఎన్నికల కమిటీ ఏర్పాటైంది. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన నేతలు సభ్యులను ఎంపిక చేశారు. ఈ కమిటీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా డాక్టర్ లక్ష్మణ్, మురళీధర్‌రావు, శ్రీ పేరాల శేఖర్‌రావు, కిషన్ రెడ్డి, రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, జి.రామకృష్ణారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ఇ. లక్ష్మీనారాయణ, మంత్రి శ్రీనివాసులు, చింతా సాంబమూర్తి, నగురావు నమాజీ, ఆకుల విజయ, చందా లింగయ్య దొరను ఎంపిక చేశారు. -
‘కేసీఆర్.. శ్యామల కన్నీళ్లు కనిపించలేదా’
సాక్షి, హైదరాబాద్ : బంగారు తెలంగాణలో సగభాగం అయిన మహిళలతో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. జనాభాలో సగం ఉన్న మహిళల ఓట్లతో రాష్ట్రంలో గద్దెనెక్కిన సీఎం కేసీఆర్.. నేడు వారి సమస్యలు పట్టించుకోవడం లేదని, మహిళలు నరకకూపంలోకి వెళ్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆమె విమర్శించారు. ఆదివారం జరిగిన బోనాల వేడుకల్లో మహిళలు కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. మేం మాట్లాడితే రాజకీయాలని కొట్టిపారేస్తారని, మరి భవిష్యవాణి చెప్పిన అమ్మవారే ఇలాంటివి చెప్పడం రాష్ట్రం మొత్తం టీవీల్లో చూసిందన్నారు. ఆకుల విజయం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బంగారు బోనం తెచ్చినా కూడా మహిళల్లో ఆనందం లేదు. అధికారులు, పోలీసుల దురుసు ప్రవర్తనతో జోగిని శ్యామల కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మీ ప్రభుత్వ చేతకాని తనం. శ్యామల కన్నీళ్లు మీకు కనిపించలేదా కేసీఆర్. బంగారు బతుకమ్మతో పాటు బంగారు బోనం సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎంపీ కవితది అయింది. రాష్ట్రంలో మహిళ అంటే కవిత ఒక్కరేనా. ఇంకో మహిళ కూడా కనిపించడం లేదా.? నిన్న మహిళా రిపోర్టర్లు, యాంకర్లు అక్కడ ధర్నా చేయాల్సిన దుస్థితి. భవిష్యవాణి చెప్పే వారు(స్వర్ణలత), జోగిని శ్యామల ఇలా అందరూ ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి ఆలోచించాలి. కవితకు ఏం అర్హత ఉంది? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు జాతర చేసుకుంటుంటే సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీస్ అధికారి సుమతి దురుసుతనానికి మీరు కారణం కాదా. స్వామీజీని బహిష్కరించిన తీరు, జోగిని పట్ల మీ తీరుపై మీరు సమాధానం చెప్పాలి. వచ్చే రోజుల్లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తున్నాం. సికింద్రాబాద్‌లో బోనాన్ని ఏ అర్హతతో కవిత ఎత్తుకున్నారు. కవితకు, సికింద్రాబాద్‌కు ఏమైనా సంబందం ఉందా. సీఎం కేసీఆర్ సతీమణి బోనం ఇస్తే మాకు ఏ అభ్యంతరం ఉండేది కాదు. బోనాల నేపథ్యంలో జరిగిన తప్పులకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని’ ఆకుల విజయ డిమాండ్ చేశారు. బంగారు బోనం సమర్పించిన ఎంపీ కవిత తెలంగాణ ప్రభుత్వంపై జోగిని ఫైర్ శ్యామల కామెంట్లపై స్పందించిన తలసాని -
బీజేపీలో అటువంటి పరిస్థితి లేదు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో మొత్తం 1700 పార్టీలు ఉండగా.. ప్రసుతం అన్ని పార్టీల్లోనూ కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విరమణ పొందిన వెంటనే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కానీ బీజేపీలో అటువంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి.. రేపటి రోజు మీలో ఎవరైనా దేశ అధ్యక్ష పదవి చేపట్టవచ్చంటూ పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇలా బీజేపీకి చెందిన చాలా మంది వ్యక్తులు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట దేశ సంక్షేమం కోసం అంత్యోదయ మూల సిద్దాంతంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్న పురందేశ్వరి... మహిళల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఒకప్పుడు మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం ఇంటి పక్కన వాళ్లను డబ్బులు అడిగేవారు.. కానీ ప్రస్తుతం మోదీ పాలనలో ఓడీ పేరిట 5 వేల రూపాయలు తీసుకునే అవకాశం కల్పించారన్నారు. అంతేకాకుండా సంపాదించుకున్న సొమ్ముకు జన్‌ధన్ ఖాతా ద్వారా భద్రత కల్పించారని పేర్కొన్నారు. మహిళా ప్రసూతి మరణాలను దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఆమె తెలిపారు. 2014లో చాలా మంది బీజేపీ 120, 130,150, 170 స్థానాలు మాత్రమే గెలుచుకుంటారని జోస్యం చెప్పారని కానీ అనూహ్యమైన మెజారిటీ, విజయాన్ని సాధించి.. కేంద్రంలో అధికారం చేజిక్కించుకుందని వ్యాఖ్యానించారు. 250 పై చిలుకు స్థానాల్లో గెలుపొంది దేశ వ్యాప్తంగా విస్తరించిందన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమైంది... తెలంగాణ ప్రభుత్వం నాలుగు స్తంభాల ఆట నుంచి ఐదు స్తంభాల ఆటగా మారిందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఎద్దేవా చేశారు. మహిళలకు పంచే నాప్కిన్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. దసరాకు ప్రభుత్వం పంచిన చీరలు మహిళలను అవమానపరిచే విధంగా ఉండడం, రైతులకు పెట్టుబడి సహాయం విషయంలో నిర్లక్ష్యం వహించడం కేసీఆర్ పతనానికి నాంది వంటివని ఆమె వ్యాఖ్యానించారు. -
సీఎం కుమార్తెననే అహం ఆమెది
రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ సాక్షి, హైదరాబాద్: తమ పార్టీని మత కలహాలు సృష్టించి బతికే పార్టీగా సీఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత పేర్కొనడాన్ని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తీవ్రంగా ఖండించారు. సీఎం కుమార్తెననే అహంతో ఇతర పార్టీలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న ముస్లిం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. -
బీజేపీ మహిళా మోర్చా నియామకాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గాన్ని నియమించినట్లు మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులుగా కె.సునీతారెడ్డి (రంగారెడ్డి), యమున పాథక్ (మల్కాజిగిరి), డి.పవిత్ర (ఉప్పల్), రవళి కుచన (వరంగల్–అర్బన్), కల్పనా ఠాకూర్ (నిజామాబాద్), పద్మ (హైదరాబాద్), ఝాన్సీ (కుత్బుల్లాపూర్), అంథే శైలజ (ఎల్బీనగర్).. ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్ గోదావరి అంజిరెడ్డి (సంగారెడ్డి), కేతినేని సరళ (హైదరాబాద్), ఎం.నాగ పరిమళ (మేడ్చల్) నియమితులయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా శిల్పారెడ్డి (మేడ్చల్), ఎల్.తిరుమల (సిద్దిపేట), జి.సుధారెడ్డి (దుబ్బాక), వనం పుష్పలత (నల్లగొండ), ఎ.లలిత (వికారాబాద్), సుమతీరెడ్డి (రంగారెడ్డి), విజయలక్ష్మి (ముషీరాబాద్)లను నియమించారు. వీరితో పాటు కార్యాలయ కార్యదర్శిగా భారతి రజనీ కుటూర్, కె.వసుధ (సోషల్ మీడియా), వనిత (అంగన్వాడి), అధికార ప్రతినిధులుగా సుజాత, జయలక్ష్మి, ఎస్.భాగ్యలక్ష్మి, వినోదారెడ్డి, ఝాన్సీరాణి నియమితులయ్యారు. మరో 16 మందిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. -
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి భర్తకు తీవ్రగాయాలు ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం సిరిసిల్ల, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం బద్దెనపల్లి శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆకుల విజయ భర్త మోహన్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుగ్రామాల్లో సందర్శించి రాత్రి హైదరాబాద్ తిరిగి వెళుతుండగా మోహన్‌రెడ్డి కారును ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జయింది. తీవ్రంగా గాయపడ్డ మోహన్‌రెడ్డిని 108లో కరీంనగర్‌కు తరలించారు. కొట్టాల మోహన్‌రెడ్డి మాజీమావోయిస్టు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన సతీమణికి బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఖరారు కావడంతో సిరిసిల్లలో ఉంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.