సాక్షి, హైదరాబాద్ : దేశంలో మొత్తం 1700 పార్టీలు ఉండగా.. ప్రసుతం అన్ని పార్టీల్లోనూ కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా విరమణ పొందిన వెంటనే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కానీ బీజేపీలో అటువంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి.. రేపటి రోజు మీలో ఎవరైనా దేశ అధ్యక్ష పదవి చేపట్టవచ్చంటూ పురందేశ్వరి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఇలా బీజేపీకి చెందిన చాలా మంది వ్యక్తులు అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారేనంటూ ఆమె వ్యాఖ్యానించారు.
మహిళా సంక్షేమానికి పెద్దపీట
దేశ సంక్షేమం కోసం అంత్యోదయ మూల సిద్దాంతంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్న పురందేశ్వరి... మహిళల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఒకప్పుడు మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం ఇంటి పక్కన వాళ్లను డబ్బులు అడిగేవారు.. కానీ ప్రస్తుతం మోదీ పాలనలో ఓడీ పేరిట 5 వేల రూపాయలు తీసుకునే అవకాశం కల్పించారన్నారు. అంతేకాకుండా సంపాదించుకున్న సొమ్ముకు జన్‌ధన్ ఖాతా ద్వారా భద్రత కల్పించారని పేర్కొన్నారు. మహిళా ప్రసూతి మరణాలను దృష్టిలో ఉంచుకొని మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని ఆమె తెలిపారు. 2014లో చాలా మంది బీజేపీ 120, 130,150, 170 స్థానాలు మాత్రమే గెలుచుకుంటారని జోస్యం చెప్పారని కానీ అనూహ్యమైన మెజారిటీ, విజయాన్ని సాధించి.. కేంద్రంలో అధికారం చేజిక్కించుకుందని వ్యాఖ్యానించారు. 250 పై చిలుకు స్థానాల్లో గెలుపొంది దేశ వ్యాప్తంగా విస్తరించిందన్నారు.
కేసీఆర్ పతనం ప్రారంభమైంది...
తెలంగాణ ప్రభుత్వం నాలుగు స్తంభాల ఆట నుంచి ఐదు స్తంభాల ఆటగా మారిందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ ఎద్దేవా చేశారు. మహిళలకు పంచే నాప్కిన్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. దసరాకు ప్రభుత్వం పంచిన చీరలు మహిళలను అవమానపరిచే విధంగా ఉండడం, రైతులకు పెట్టుబడి సహాయం విషయంలో నిర్లక్ష్యం వహించడం కేసీఆర్ పతనానికి నాంది వంటివని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment