సమావేశంలో మాట్లాడుతున్న హమీద్ హుస్సేన్
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఎన్నికలకు ముందు కేసీఆర్ మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మించి ఓట్లు దండుకున్నాడని, రాబోయే ఎన్నికల్లో ముస్లింలు గుణపాఠం చెప్పడం ఖాయమని అల్‌ఇండియా సున్ని ఉలేమా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ హుస్సేన్ షుత్తరీ విరు చుకుపడ్డారు. బుధవారం డబీర్‌పురాలోని సంస్థ కార్యాల యంలో రాబోయే ఎన్నికలకు సున్ని ఉలేమా బోర్డు రూపొందించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా షుత్తరీ మాట్లాడుతూ, ప్రతి ఏటా మైనార్టీలకు కేటాయించే బడ్జెట్ నాలుగేళ్లలో ఏ సంవత్సరం కూడా 40% కంటే ఎక్కువ విడుదల కాలేదన్నారు.
అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని హామీఇచ్చిన కేసీఆర్ ప్రస్తుతం ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ ముస్లింల ప్రయోజనాలకోసం పాటుపడకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలకు కోసం పని చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలతో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి జరగలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ సెక్యులర్ పార్టీ తాము ప్రతిపాదిస్తున్న అంశాలకు పూర్తి స్థాయిలో అంగీకరిస్తే అ పార్టీకి మద్ధతు ఇస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. ముస్లింలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఉర్దూ మీడియం స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తారీక్ ఖాద్రీ, అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment