సాక్షి, హైదరాబాద్: దేశంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడే పరిస్థితులున్నందున, ప్రాంతీయ పార్టీలు, సెక్యులర్ పార్టీలు కలిసి కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారంకంటే కూడా దేశ భవిష్యత్ ముఖ్యమని, సెక్యులరిజం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కలిసి రావాలని కోరారు. పదవులకోసం బీజేపీ అమలు చేయబోయే సెమీ ఫాసిస్ట్ ధోరణులు, విధానాలకు మద్దతు తెలపవద్దన్నారు. గురువారం మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలంటూ యూపీఏలోని భాగస్వామ్యపక్షా ల్లో చీలిక తెచ్చేందుకు సీఎం కేసీఆర్ యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ రాజకీయ విధానాలు, నిర్వహిస్తున్న పాత్ర దీనినే స్పష్టం చేస్తోందన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి కేసీఆర్ తానా అంటే తందానా అంటూ వస్తున్నారన్నారు. కేసీఆర్ లేవనెత్తుతున్న అంశాలపై కమ్యూనిస్టు పార్టీలకు అభ్యంతరాలున్నా యని చెప్పారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పడాలని, బీజేపీ ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లేకుండానే ఇది ఏర్పడాలని కోరుకుంటున్నామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒకరోజు కుదించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షాల ఎన్నికల ప్రచారం ముగియడం తో చివరిరోజు ఇతర పార్టీల ప్రచారానికి అవకాశమివ్వకుండా చేయడాన్ని బట్టి ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని స్పష్టమవుతోందన్నారు.
సిట్‌లు వంటింటి కుందేళ్లు: నారాయణ
వివిధ అంశాలపై చంద్రబాబు, కేసీఆర్ వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్)ఇద్దరు సీఎంల వంటింటి కుందేళ్లుగా మారిపోయాయని నారాయణ ఎద్దేవా చేశారు. ఈ సిట్‌లను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment