సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండదండలతోనే రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి, అక్రమాలకు వత్తాసు పలుకుతున్నందునే.. ప్రతిగా డీజీపీ అక్రమాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లల పార్కు ఆక్రమణపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ డీజీపీ ఠాకూర్ ఇంకా పదవిలో కొనసాగడమేమిటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతం మంగళగిరిలో ఓ రైతు తెలియక భవనం నిర్మిస్తే సీఆర్డీఏ అధికారులు ఆ నిర్మాణాన్ని తొలగించారని.. అయితే డీజీపీ ఠాకూర్ మాత్రం హైదరాబాద్‌లో పిల్లల పార్కును ఆక్రమించి మరీ భవనాన్ని నిర్మించారని తెలిపారు.
సీఎం చంద్రబాబు కరకట్టలను ఆక్రమించి నిర్మించిన భవనంలో ఉండగా, తాను పిల్లల పార్కును ఆక్రమించడంలో తప్పేముందని డీజీపీ భావించినట్లున్నారని ఎద్దేవా చేశారు. రాష్టంలో ఎంతో మంది సమర్థులైన పోలీసు అధికారులు ఉండగా ఠాకూర్‌ను డీజీపీగా, ఏసీబీ డీజీగా జోడు పదవుల్లో కొనసాగించడం వెనుక మర్మమేమిటని చంద్రబాబును నిలదీశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై విచారణ కూడా మొదలుకాక ముందే అది సానుభూతి కోసమే చేశారంటూ డీజీపీ ఠాకూర్ ప్రకటించడం కేసు నుంచి సీఎం చంద్రబాబును కాపాడేందుకేనని స్పష్టం చేశారు డీజీపీ నిర్మించిన అక్రమ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి సేకరించారన్న వాస్తవాలను త్వరలో బయటపెడతానని ఎమ్మెల్యే ఆర్కే వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు
మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో 2014 నుంచి 2019 వరకు పనిచేసిన సబ్ ఇన్‌స్పెక్టర్ల వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను డీజీపీ ఠాకూర్ వేధిస్తూ అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. డీజీపీ ఠాకూర్ అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే ఆళ్ల ప్రకటించారు. డీజీపీ ఠాకూర్ అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రులకు ఫిర్యాదు చేస్తానని ఆయనకు శిక్షపడే వరకూ విశ్రమించబోనని తేల్చిచెప్పారు. తాజా రాజకీయ పరిణామాలపై విలేకరుల అడిగిన ప్రశ్నలపై ఎమ్మెల్యే ఆర్కే స్పందిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి తాను సహా పార్టీ నేతలు, కార్యకర్తలు కట్టుబడి ఉంటామన్నారు.
చంద్రబాబు అండతోనే డీజీపీ అక్రమాలు
Published Thu, Mar 7 2019 3:49 AM | Last Updated on Thu, Mar 7 2019 3:49 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment