
సత్తెనపల్లిలో దీక్షలో కూర్చున్న వారికి పండ్లరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న అంబటి రాంబాబు
గుంటూరు వెస్ట్/సత్తెనపల్లి: అధికారంలో ఉన్న పెద్దలు ప్రజలనే కాకుండా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు గుంటూరు కలెక్టరేట్ ఎదుట శనివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ డైమండ్ బాబు అధ్యక్షత వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ హాయ్‌లాండ్ అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయించారన్నారు. రాష్ట్రంలో 19.70 లక్షల మంది బాధితులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6850 కోట్లు ఉండగా అగ్రిగోల్డ్ ఆస్తులు రూ.10 వేల కోట్లకు పైగానే ఉన్నాయన్నారు. తొలి దశలో రూ.1180 కోట్లు విడుదల చేస్తే దాదాపు 80 శాతం మంది బాధితులకు రుణ విముక్తి కలుగుతుందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మొహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్యపేరుతో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన 14 ఎకరాలు అడ్డదారిలో కొనుగోలు చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గుంటూరులో దీక్షలో పాల్గొన్న లేళ్ళ అప్పిరెడ్డి. ఎమ్మెల్యే ముస్తఫా, వెస్ట్ సమన్వయకర్త ఏసురత్నం తదితరులు
అగ్రిగోల్డ్ ఆస్తుల కాజేతకు ప్రభుత్వం కుట్ర
అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసేందుకు ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుట్ర పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. సత్తెనపల్లిలో తాలూకా సెంటర్‌లో ఏర్పాటు చేసిన అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్షలో శనివారం ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న ఖరీదైన ఆస్తులను కారుచౌకగా కొట్టేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ఆస్తులను బహిరంగ వేలం వేసి బాధితులకు అణాపైసాతో సహా చెల్లిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. బాధితులకు అన్ని విధాలుగా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. దీక్షలతో ప్రభుత్వం దిగి రాకుంటే ఈ నెల 30న జిల్లా కేంద్రంలో దీక్ష చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు మర్రి సుబ్బారెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, వైఎస్సార్‌సీపీ నాయకులు డాక్టర్ మక్కెన అచ్చయ్య, అంబటి మురళి, షేక్ నాగూర్‌మీరాన్ తదితరులు మాట్లాడారు. దీక్ష చేస్తున్న వారికి అంబటి రాంబాబు పండ్ల రసం అందించి దీక్షలను విరమింప చేశారు.
Comments
Please login to add a commentAdd a comment