
సాక్షి, విజయవాడ : టెక్నాలజీ పేరిట ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుతో తెలుగుదేశం ప్రభుత్వం దారుమైన మోసానికి పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా ఫైబర్ గ్రిడ్ అని ఘనంగా ప్రారంభించారు. కానీ, దాని వెనుక చంద్రబాబు పెద్ద కుట్రకే తెరలేపారు అని అంబటి చెప్పారు. ట్రాయ్ రూల్స్ ప్రకారం ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే ఇందులోకి రాకూడదనే ఉంది. కానీ, ఐపీ టీవీ రూపంలో ఈ రంగంలోకి దొడ్డిదారిలో ప్రవేశించాలని చంద్రబాబు చూశారు. పైగా హేరిటేజ్ పార్టనర్స్ ఇందులో భాగస్వాములు కాగా.. దుర్భుద్ధితో ఓ మెమోను కూడా జారీ చేశారు. ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ తప్ప మిగతా ఎవరూ కూడా ఎలక్ట్రికల్, టెలిఫోన్ పోల్స్ మీద కేబుల్స్ వేయటానికి వీల్లేదంట. అలా చేస్తే పోలీసుల సహకారంతో అయినా తొలగించండి అని ఆదేశాలు జారీ చేశారు. అది ముమ్మాటికీ చట్ట విరుద్ధమైన ఆదేశం అని అంబటి మండిపడ్డారు.
ఏ ప్రైవేట్ ఎంస్‌వో కూడా సొంతంగా కేబుల్ లైన్ వేసుకోలేరు. పైగా లైసెన్స్ తీసుకున్నవారు ఎవరైనా సరే పోల్ మీదుగా, అండర్ గ్రౌండ్ ఎక్కడైనా వేసుకోవచ్చని రూల్స్ లో పేర్కొని ఉంది. కానీ, ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ఆపరేటర్లను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా తమకు అనుకూలంగా లేని ఛానెళ్లపై వేటు వేయాలని ప్రయత్నిస్తోంది. అది ఖచ్ఛితంగా అప్రజాస్వామిక చర్యేనని ఆయన పేర్కొన్నారు.
ఇది చాలదన్నట్లు ఈ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. టెక్నాలజీ వ్యతిరేకం.. అద్భుతాలకు అడ్డుపుల్ల వేస్తున్నారంటూ లోకేష్, చంద్రబాబులు వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మీరు చేసేది అద్భుతాలు కావు. మీడియా మీద నియంత్రణ కోసం చేసే నిరంకుశ యత్నాలు. టెక్నాలజీ ప్రజలకు అందాలి. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. భవిష్యత్తులో ముందడుగు కోసం ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు. ఒకవేళ చేయాలనుకుంటే అందులో ప్రభుత్వ రంగ సంస్థ జోక్యం ఉండకూడదు. ఈ నిర్ణయం ద్వారా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది. వారి పొట్ట కొట్టినట్లువుతుంది. దీనికితోడు మళ్లీ సెటప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాలంటే వినియోగదారులపైనా భారం పడటం ఖాయం. అందుకే ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవస్థకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని అంబటి స్పష్టం చేశారు. ఈ విషయంలో గతంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టే ఆర్డర్లు తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. కేబుల్ ఆపరేట్లకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అంబటి భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment