సాక్షి, అమరావతి: లాలూచీ రాజకీయాలు, తెరచాటు వ్యవహారాలు, రహస్య ఒప్పందాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయ కుయుక్తులు, వంగివంగి దండాలు పెట్టడాలు, తన తప్పులను ఇతరులపైకి నెట్టి పబ్బం గడుపుకోవడం, ప్రజలను వంచించడం చంద్రబాబు నైజమని మండిపడ్డారు. అంబటి శనివారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరువైతే, వాటి గురించి ఆర్భాటంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. మహానేత వై?ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన ఆరోగ్యశ్రీ, 108, ఉచిత విద్యుత్ వంటి పథకాలు బాగా ప్రజాదరణ పొందాయని, అందువల్లే ప్రజలు ఆయనను రెండోసారి గెలిపించుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటిదాకా 110 పథకాలు ప్రవేశపెట్టామని టీడీపీ అంటోంది, వాటి పేర్లేమిటో చంద్రబాబు గానీ, నారా లోకేశ్ గానీ చెప్పగలరా? అని నిలదీశారు. ప్రభుత్వ ధనాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సొంత ప్రచారం చేసుకుంటున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
బాబు గతమంతా వెన్నుపోట్లే...
‘‘ఓవైపు బీజేపీతో రహస్య సంబంధాలు, లాలూచీ రాజకీయాలు సాగిస్తూ వైఎస్సార్‌సీపీపై నిందలేస్తారా? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చినప్పటి నుంచి 2009 మినహా మిగతా అన్ని ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న మాట నిజం కాదా? బీజేపీ, టీడీపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీని ఒంటరిని చేస్తామని, ధర్మ పోరాటాలు, దీక్షలు చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నిన్న మొన్నటి దాకా భయంతో వణికిపోయి ప్రజలు తనకు రక్షణ వలయంగా ఉండాలని వేడుకోవడం వాస్తవం కాదా? ఇప్పుడు బీజేపీకి సన్నిహితంగా ఉండే మిత్రులతో ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ సిద్ధాంతకర్త, రక్షకుడైన ఓ పత్రికాధిపతితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎందుకు భేటీ అయ్యారో, ఏం జరిగిందో బయటపెట్టాలి. ముందొకటి, తెర వెనుక ఒకటి చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరీ సమక్షంలోనే నిలదీస్తే చంద్రబాబు మాత్రం ఏదో విధంగా సర్దుకుపోదాం అన్నట్టుగా వ్యవహరించారు. బీజేపీతో, కాంగ్రెస్‌తో లాలూచీ రాజకీయాలు నడుపుతూ వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారు. చంద్రబాబు ఏ క్షణంలోనైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిక్షణం కుమ్మక్కు రాజకీయాలు నడిపే చంద్రబాబు తెరముందు ప్రగల్భాలు పలుకుతారు, తెరవెనుక కాళ్లు పట్టుకుంటారు. ఆయనకు నిజమైన పోరాటాలు చేసిన చరిత్ర లేదు. బాబు గతమంతా వెన్నుపోట్లే. ప్రత్యేక హోదా కోసం మా పార్టీ ఎంపీలు చేసిన రాజీనామాలు త్యాగానికి ప్రతీక. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలి. కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయన్న ఆలోచనే వైఎస్సార్సీపీ బలంగా ఉందనడానికి సంకేతం’’ అని అంబటి స్పష్టం చేశారు.
వంచనే చంద్రబాబు నైజం
Published Sun, Jul 15 2018 3:50 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment