సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఇంకా టీడీపీ మత్తు నుంచి పవన్ బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘వైఎస్సార్ కాపు నేస్తం’పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. గత ఐదేళ్లలో కాపు సామాజిక వర్గం పట్ల చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ రాక్షసంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఏడాదికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. ఐదు వేల కోట్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ ఐదేళ్లలో కాపులకు ఖర్చుచేసింది కేవలం రూ. 1800 కోట్లు మాత్రమేనని అంబటి వివరించారు. (పవన్ కల్యాణ్‌కు ఎందుకీ ఉక్రోషం?)
ఆ రోజు పవన్ ఎక్కడున్నారు?
‘కాపులపై శ్వేత పత్రం విడుదల చేయాలంటున్న పవన్ కాపు సామాజిక వర్గాన్ని పచ్చి మోసం చేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు? రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు మోసం చేసిన విషయం గుర్తులేదా? గత ప్రభుత్వం ముద్రగడ కుటుంబాన్ని వేధించి అరెస్ట్ చేస్తే పవన్ ఎందుకు నోరు మెదపలేదు? దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, పల్లం రాజు మిగతా కాపు పెద్దలు ముద్రగడకు మద్దతుగా సమావేశమైన రోజున పవన్ ఎక్కడున్నారు? కాపులపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు పవన్ ఎందుకు నోరు మెదపలేదు? కాపులపై చంద్రబాబు తప్పుడు కేసులు పెడితే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ కేసులను ఎత్తివేశారు. (అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి)
మోసం చేసిన బాబును భజాన మోశారు
కాపులను చంద్రబాబు మోసం చేసిన దాంట్లో పవన్‌కు కూడా భాగస్వామ్యం ఉంది. కాపుల గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. వారిని మోసం చేసిన చంద్రబాబును భుజాన మోశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అదే చేస్తాము. కాపులను మోసం చేయాలనే ఆలోచన మాకు లేదు. అధికారంలోకి వచ్చిన ఈ 13 నెలల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 4 కోట్ల మందికి రూ.43 వేల కోట్లు ఖర్చు చేసింది. కాపుల్లో వెనకబాటుతనం తొలగించేందుకు రూ. 4770 కోట్లను 13 నెలల్లో వివిధ రూపాల్లో ప్రభుత్వం ఖర్చు చేసింది. ('ఆహా..! లోకేష్ ఏం మాట్లాడుతున్నాడు')
మేనిఫెస్టోలో పెట్టలేదు.. అయినా
కాపు మహిళలకు చేదోడు వాదాడోగా ఉండటం కోసం సీఎం జగన్ ‘వైఎస్సార్ కాపు నేస్తం’ కార్యక్రమం ప్రారంభించారు. ఈ పథకం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అర్హత కలిగిన ప్రతి కాపు మహిళకు ‘కాపు నేస్తం’ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఈ పథకానికి ఇంకా సమయం ఉంది. ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకోకపోతే చేసుకోండి. ‘కాపు నేస్తం’ కోసం ఎవరైన అప్లై చేయకపోతే పవన్, చిన్నరాజప్పలు దగ్గరుండి దరఖాస్తు చేయించాలి’ అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. (రైతులు రూపాయి కడితేచాలు)
Comments
Please login to add a commentAdd a comment