బీజేపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న అమిత్ షా. చిత్రంలో కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలనలోని అవినీతికి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా, రాజకీయంగా ప్రయోజనం పొందే స్థాయిలో పోరాటాలు ఎందుకు లేవని బీజేపీ రాష్ట్ర నేతలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిలదీశారు. చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి ఏముందనే ప్రశ్నకు సమాధానం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా ఉంటేనే ముఖ్య నేతలు వచ్చి చేరుతారని.. పార్టీ బలోపేతంపై అన్ని స్థాయిల్లో దృష్టి పెట్టాలని సూచించారు. ఒకరోజు పర్యటన కోసం శుక్రవారం రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా పలు సమావేశాల్లో పాల్గొన్నారు. ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగిన అమిత్ షాకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడి నుంచి సోమాజిగూడలోని ఒక హోటల్‌కు వెళ్లిన షా.. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ ముఖ్యులతో అరగంటపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 సమావేశాలను నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బీజేపీ హోల్‌టైమ్ వర్కర్లతో సమావేశమయ్యా రు. అనంతరం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు. మీడియాకు అనుమతి లేకుండా జరిగిన ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలిసింది. పార్టీ ముఖ్యులు, సమావేశాల్లో పాల్గొన్న నాయకులు అందించిన సమాచారం ప్రకారం అమిత్ షా మాట్లాడిన అంశాలు ఇలా ఉన్నాయి..
కోర్టుల్లో వ్యాజ్యాలు వేయండి..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, ఆ నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని అమిత్ షా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా చేపట్టిన అన్ని ఇంజనీరింగ్ వ్యవహారాలు, సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆయా రంగాల్లో నిపుణులతో లోతుగా అధ్యయనం చేసి, న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయాలని ఆదేశించారు. ఎన్నికలకు ముందుగానే జాతీయ స్థాయిలో పార్టీకి అనుకూలంగా పలు నిర్ణయాలు ఉంటాయని, ఈ పరిణామాలతో రాష్ట్రంలో ప్రయోజనం పొందేందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులు ఉండవని, మొత్తం 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
ఏముందని చేరికలు?
‘ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతలెవరూ బీజేపీలో చేరడానికి సుముఖంగా లేరు, ఉండరు’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంటే ఎవరైనా చేరడానికి సిద్ధపడతారు. చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్‌లోనే ఉన్నా, వారికి విశ్వాసం కల్పించడంలో వెనుకబడి ఉన్నాం. చాలా నియోజకవర్గాల్లో పార్టీ ఏముందనే ప్రశ్నకు మన దగ్గర సమాధానం లేకుండా పోయింది’అని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా ఉంటేనే ముఖ్య నేతలు వచ్చి చేరుతారని చెప్పారు.
పార్టీ బలోపేతంపై అన్ని స్థాయిల్లో దృష్టి పెట్టాలని సూచించారు. ‘కేవలం ఇతర పార్టీల్లో ఉన్న రాజకీయ నేతల వైపే చూస్తున్నారు. వివిధ రంగాల్లోని ప్రముఖులు, ఉద్యమ సంఘాల నేతలను ఎందుకు పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమలో, అంతకముందు రాష్ట్రంలో సామాజిక, చైతన్య ఉద్యమ సంఘాల పాత్ర కీలకం. ఆయా సంఘాల నేతలతో చర్చించి, వారు పార్టీతో కలసి పని చేసే అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలి’అని సూచించారు. అనంతరం జన చైతన్య యాత్ర పుస్తకావిష్కరణ చేశారు.
అంతా మీ ఇష్టమేనా..?
పార్టీ చెప్పినట్లు కాకుండా అంతా మీ ఇష్ట ప్రకారమేనా అని పార్టీ విస్తారక్ (పూర్తి కాలపు కార్యకర్తలు)ల సమావేశంలో అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను కాకుండా సొంత ఎజెండాతో ఎలా పని చేస్తారంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయ స్థాయి అంశాల ప్రకారం 23 మార్గదర్శకాలను ఇస్తే, వాటిని 12గా ఎలా కుదించారని నిలదీశారు. వచ్చే నెలాఖరునాటికి అన్ని నియోజవకర్గాల్లో బూత్ కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించారు.
టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించే పోరాటాలు: సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను మట్టి కరిపించే పోరాటాలు చేపట్టాలని అమిత్ షా ఆదేశించినట్టుగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. షాతో సమావేశం అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించారు. 2019 ఎన్నికలపై పార్టీ శ్రేణులకు షా మార్గనిర్దేశం చేశారని చెప్పారు. 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీలను నియమించాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఒంటెత్తు పోకడలతో, కుటుంబ పాలన చేస్తున్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినట్టుగా ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోపే అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఉంటుందని అమిత్ షా చెప్పినట్లు పార్టీ ముఖ్యనేత పేరాల చంద్రశేఖర్‌రావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment