కుకనూరు సభలో ఆవేశంగా ప్రసంగిస్తున్న షా
సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నీటి పారుదల రంగానికి పెద్దపీట వేస్తామని, రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని పార్టీ అధినేత అమిత్‌షా పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కొప్పళ జిల్లా కుకనూరులో రోడ్ షో, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలతో మండిపడ్డారు. కాంగ్రెస్ ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ రాష్ట్రాన్ని అ«థోగతి పాల్జేసిందని, సీఎం సిద్ధరామయ్య కేంద్ర నిధులతో సోకులు చేసుకుని ప్రజలకు వట్టి చేయి చూపారని విమర్శించారు. సిద్ధరామయ్య ఓటమి భయంతోనే చాముండేశ్వరితో పాటు బాదామిలో కూడా పోటీ చేస్తున్నారని, బాదామిలో కూడా బీజేపీ అభ్యర్థి శ్రీరాములు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. రెండు నియోజకవర్గాల్లోనూ సీఎంకు ముఖభంగం కాబోతోందన్నారు. సొంత నియోజకవర్గంలో గెలవలేని సీఎం ఇక రాష్ట్రంలో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.
రాహుల్‌కు వందే మాతరం వినే ఓపిక లేదు
రాహుల్‌గాంధీకి వందేమాతర గీతం వినడానికి కూడా ఓపిక లేదని, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కార్యక్రమంలో వందేమాతర గీతం పాడటం పూర్తి కాక మునుపే ఆపేయడం బాధాకరంగా ఉందని అన్నారు. దేశభక్తి గురించి కాంగ్రెస్‌కు తెలియదనే విషయం తేటతెల్లమైందన్నారు. మే 15నఓట్ల లెక్కింపు రోజున మూడో రౌండ్ కల్లా కాంగ్రెస్ నేతలు ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పళ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గవి సిద్ధేశ్వర సన్నిధిలో...
అమిత్‌షా కొప్పళ జిల్లాలో విస్తృత పర్యటనలు చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొని బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తాలూకాలోని బసాపుర సమీపంలోని ప్రైవేటు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అమిత్‌షా నగరంలోని శివ చిత్ర మందిరంలో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని గెలుపు వ్యూహాలపై చర్చించారు. మహిళలు ఆయనకు హారతితో స్వాగతం పలకగా, అమిత్‌షా మాట్లాడుతూ పురుషులతో సమానంగా ఉన్న మహిళలు గెలుపు ఓటములను శాసిస్తారని, ప్రతి ఒక్క మహిళ బీజేపీకి ఓటు వేసేలా చైతన్యం తీసుకుని రావాలని సూచించారు. అక్కడ నుంచి నేరుగా కొప్పళ జిల్లా ప్రజల ఆరాధ్య దైవం గవిసిద్దేశ్వర మఠానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మఠం స్వాములు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మఠం విద్యార్థులతో ముచ్చటించారు. గవిసిద్దేశ్వర స్వామి మహిమలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment