
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 10న రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌లో ముఖ్య నేతలతోపాటు, వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ కానున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు పార్టీ తరఫున పోటీలో ఉండే అభ్యర్థులను గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.
బుధవారం (10న) ఉదయం పది గంటలకు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపైస్థాయి నాయకులతో సమావేశమై మార్గదర్శనం చేస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి తెలిపారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశం తరువాత మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, భువనగిరి, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లతో సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఆ సమావేశం తరువాత మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగే సమరభేరి బహిరంగ సభలో అమిత్‌షా పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment