రాజమాతకు పుష్పగుచ్ఛమిస్తున్న షా. చిత్రంలో యధువీర్, యడ్యూరప్ప, అనంత్
సాక్షి బెంగళూరు: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచార వేడిని పెంచారు. సమయం దగ్గరపడిందంటూ కాంగ్రెస్ నేత, సీఎం సిద్దరామయ్యపై విమర్శల తీవ్రత పెం చారు. బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. పాత మైసూరులో శుక్రవారం అమిత్ పర్యటించారు. అధికారంలోకి వస్తే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను చంపిన హంతకులను వేటాడి, వారికి తీవ్ర శిక్షలు పడేలా చేస్తామన్నారు.
మైసూరులో 2016లో హత్యకు గురైన బీజేపీ కార్యకర్త రాజు కుటుంబసభ్యులను పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. ‘సీఎం సిద్దరామయ్యకు సమయం దగ్గర పడింది. రాజకీయాల్లో హింసకు తావులేదు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను చంపటం ద్వారా కాషాయ ప్రభంజనాన్ని ఆపాలని ఆయన అనుకుంటే పొరపాటు పడ్డట్లే. కర్ణాటక వ్యాప్తంగా దాదాపు 22 మంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు హత్యకు గురైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు.
జైళ్లలో ఉన్న హంతకులను విడుదల చేస్తూ మరిన్ని హత్యలు చేయటానికి వారికి ప్రభుత్వం అవకాశం ఇస్తోంది’ అని షా మండిపడ్డారు. ‘ఈ ప్రాంతంలో బీజేపీ బలహీనంగా ఉందని అంటూ ఉంటారు కానీ రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతం ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్‌లకు భారీ షాక్ ఇవ్వనున్నార’ని జోస్యం చెప్పారు. ప్రస్తుత పర్యటనలో భాగంగా షా మైసూరు, చామరాజనగర, మాండ్య, రామనగర జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా గెలవలేదు.
నాది తప్పే..
అవినీతిలో యడ్యూరప్ప(బీజేపీ సీఎం అభ్యర్థి)ది నంబర్ వన్ ప్రభుత్వమని ఇటీవల నోరు జారిన అమిత్ షా దానిపై వివరణ ఇచ్చారు. ‘నాది పొరపాటే. పొరపాటున సిద్ధరామయ్య పేరుకు బదులు యడ్యూరప్ప పేరును ఉచ్ఛరించాను. కానీ కర్ణాటక ప్రజలు తప్పు చేయరు. సిద్దరామయ్య అవినీతి వారికి బాగా తెలుసు’ అని వ్యాఖ్యానించారు. లింగాయత్‌లకు మత హోదా కల్పించాలనే సిద్దరామయ్య ప్రతిపాదన నేపథ్యంలో వారి మద్దతు సంపాదించేందుకు అమిత్ శుక్రవారం లింగాయత్‌లకు చెందిన సుత్తూర్ మఠం, తుంకూరులోని సిద్దగంగ, మురుగ మఠాలతోపాటు దళిత వర్గానికి చెందిన మాదర చెన్నయ్య మఠాన్ని కూడా సందర్శించారు.
మోదీ దేశాన్ని నాశనం చేశారు
‘ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. దళితులు, పేదలకు ఆయన చేసిందేమీ లేదు’ అని షా ప్రసంగాన్ని పొరపాటుగా అనువదించడం వివాదమైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవనగిరి జిల్లాలో బీజేపీ శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ హిందీలో మాట్లాడారు. ఆయన ప్రసంగాన్ని ధార్వాడ ఎంపీ ప్రహ్లాద జోషి కన్నడలోకి అనువాదం చేశారు. ‘సిద్దరామయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. యడ్యూరప్పను సీఎం చేస్తే కర్ణాటక అభివృద్ధిలో ముందుంటుంది’ అని షా చెప్పారు.
అయితే అనువాదంలో జోషి.. ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేస్తారని వ్యాఖ్యానించారు. వెంటనే అమిత్ దానిని సరిచేసి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దళిత నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. దళిత నేతలు అడిగిన పలు ప్రశ్నలకు అమిత్ షా సమాధానం చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డేను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని కొందరు పట్టుబట్టడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
రాచకుటుంబానికి ఆహ్వానం
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ పాత మైసూరులోని రాజభవనానికి చేరుకుని ఒడయార్ రాచకుటుంబానికి చెందిన రాజమాత ప్రమోదాదేవి, యువరాజు యధువీర్‌తో చర్చలు జరిపారు. రాజమాత కోరుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మైసూరు టికెట్ ఇస్తామని, యధువీర్‌కు పార్టీలో ఉన్నత స్థానాన్ని ఇస్తామని ఈ సందర్భంగా అమిత్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఈ భేటీతో కాంగ్రెస్ నేతల్లో కలకలం రేగింది. అయితే, తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదనీ, సేవా కార్యక్రమాలతోనే ప్రజలకు దగ్గరగా ఉంటానని ఇటీవల యధువీర్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment