సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీతో పొత్తు నుంచి బయటకు రావాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడమే మేలని, టీడీపీతో పొత్తు వద్దని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఒంటరి పోరుకే సిద్ధం కావాలని అమిత్ షా స్పష్టం చేశారని సమాచారం. టీడీపీ కన్నా బీజేపీ బలంగా ఉందని, కొన్ని చోట్ల కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టే పరిస్థితిలో ఉందని తమ అంతర్గత సర్వేలో తేలిందని వారు అమిత్‌షాతో పేర్కొన్నట్లు తెలిసింది. అధికార టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని అందిపుచ్చుకుని పుంజుకునే సత్తా కాంగ్రెస్‌కు లేదని, దీన్ని ఉపయోగించుకుని బలపడే సరైన సమయం ఇదేనని పేర్కొన్నట్లు తెలిసింది.
కాగా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఈ మేరకు ఢిల్లీ నాయకత్వం కూడా ఒప్పుకొందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం అని, అందుకే తమను చూసి టీఆర్‌ఎస్ భయపడుతోందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పెద్దమొత్తంలో నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని చెప్పారు. ఈ నెలలో అమిత్‌షా రాష్ట్రానికి వచ్చి మరోసారి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.
నియోజకవర్గాల పునర్విభజన లేనట్లే
కమలనాథులకు తేల్చి చెప్పిన అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉండదని మరోసారి స్పష్టమైంది. గురువారం రాష్ట్ర బీజేపీ నేతలతో జరిగిన సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ విషయాన్ని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్య అలాగే ఉంటుందని, వాటి సంఖ్య పెంచే యోచన లేదని స్పష్టం చేశారని సమాచారం.
ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున అందుకు తగ్గ వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని, అభ్యర్థుల ఎంపిక, పనితీరుపై దృష్టి సారించాలని పేర్కొన్నట్లు తెలిసింది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న చర్చల్లో కూడా నిజం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. సాధారణ షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు పేరుతో హడావుడి పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment