ఉనికి కోసమే బీజేపీతో చంద్రబాబు పొత్తు | Chandrababu alliance with BJP is for existence | Sakshi
Sakshi News home page

ఉనికి కోసమే బీజేపీతో చంద్రబాబు పొత్తు

Published Wed, Feb 21 2024 5:37 AM | Last Updated on Wed, Feb 21 2024 5:56 AM

Chandrababu alliance with BJP is for existence - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జనసేనతో జతకట్టినా చంద్రబాబుకు ఘోర ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు భావిస్తే ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.

ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సీఎం వైఎస్‌ జగన్‌ మరింత పెంచుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ పొత్తులకు వ్యతిరేకమని, ఒంటరిగా పోటీ చేయడమే తమ విధానమని అన్నారు. ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలే ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం, నిత్యం జనంతో మమేకమవడం, ప్రజలకు మంచి చేయడం, మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని ప్రజలను కోరడమే సీఎం జగన్‌ సిద్ధాంతమని తెలిపారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసే చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమని, ప్రజలకు మరింత మేలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు మద్దతు తెలిపామని ఆయన చెప్పారు. సెక్యులర్‌ భావనకు విఘాతం కలిగించే ట్రిపుల్‌ తలాఖ్‌ వంటి బిల్లులను వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

రేపల్లె, వేమూరులో టీడీపీకి గట్టి షాక్‌
వైఎస్సార్‌సీపీలో చేరిన ఆ నియోజకవర్గాల టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు
బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియో­జకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. రేపల్లె నియోజకవర్గ టీడీపీ, జనసేన నాయకులు, వేమూరు నియోజకవర్గం చుండూ­రు, భట్టిప్రోలు, అమర్తలూరు మండలాల­కు చెందిన వందలాది టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ తాడేప­ల్లిలో­ని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల­యంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా­రు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మా­ట్లాడు­తూ.. వైఎస్సార్‌­సీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేసే పార్టీ అని చెప్పారు. రాష్ట్రంలో లోక్‌సభ, శాసన సభ అభ్య­ర్థుల ఎంపికలో సీఎం వైఎస్‌ జగన్‌ సామాజిక న్యాయాన్ని  పాటిస్తున్నారని తెలిపారు. వేమూ­రు ప్రజలు వరికూటి అశోక్‌బాబును గెలిపించాలని, ఆయన అందరికీ న్యాయం చేస్తారని చె­ప్పారు. ఎస్సీ సామాజికవర్గంలో వర్గ విభేదా­లు సృష్టించేందుకు చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. నిత్యం ప్రజల్లోనే ఉండే ఊవూరు గణేష్‌ను రేపల్లె ప్రజలు గెలిపించాలని కోరారు.

రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు మూడో అవకాశం ఇవ్వొద్దని కోరారు. సత్యప్రసాద్‌ హైదరాబాద్‌లో కూర్చుని జూదం ఆడుకుంటాడని, ప్రజలకు అందుబాటులో ఉండడని చె­ప్పారు. పార్టీ కోసం రాజ్యసభ సభ్యుడు మోపి­దేవి వెంకటరమణ చేసిన త్యాగం మరు­వలేనిదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం పని చేశారని కొనియాడారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు సీఎం జగన్‌ చెప్పారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement