సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆనం రామనారయణ రెడ్డి మండిపడ్డారు. ఎవరు ప్రశ్నించరాదనే స్థాయికి చంద్రబాబు వచ్చారని, దేశ ఔన్నత్యాన్నే ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు, హత్యాయత్నం కుట్రలపై స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐ దర్యాప్తు జరపడానికి వీల్లేదని, అసలు ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికే వీల్లేదంటూ టీడీపీ సర్కారు రహస్యంగా ఓ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ జీవోపై ఆనం శనివారం మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశంలో ఏపీ అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఎందుకింత భయమని, రాష్ట్రంలో ఐటీ దాడులు చేస్తే ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని, ఆయన పాలన రాజ్యాంగ బద్ధంగా సాగుతోందా? అని నిలదీశారు. చంద్రబాబు బినామీ సంస్థలపై దాడులు జరిగితే ఆయనకెందుకు భయమని, ఏపీలో జరుగుతున్న అవినీతి, అన్యాయన్ని.. పార్టీలన్ని ప్రశ్నించాలని కోరారు. ప్రతిపక్షనేత హత్యాయత్నం కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదని, వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment