న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌లా వ్యవహరించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ ఆనంద్ శర్మ విమర్శించారు. అమెరికాలో భారత ప్రధాని హోదాలో పర్యటిస్తున్న మోదీ.. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ‘ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన హౌడీ మోదీ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు 50 వేల మంది హాజరైన ఈ కార్యక్రమానికి మోదీ, ట్రంప్ కలిసి వేదిక పైకి వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ గురించి మోదీ మాట్లాడుతూ.. భారత దేశానికి ట్రంప్ నిజమైన స్నేహితుడు అని.. మరోసారి అమెరికాలో ట్రంప్ సర్కార్ రాబోతుందని వ్యాఖ్యానించారు. అనంతరం వివిధ అంశాలపై ఇరు దేశాధినేతలు ప్రసంగించారు.(చదవండి : భారత్‌కు ట్రంప్ నిజమైన ఫ్రెండ్)
ఈ నేపథ్యంలో మోదీ భారత దేశ విదేశాంగ విధానం, నిబంధనలను తుంగలో తొక్కారని ఆనంద్ శర్మ విమర్శించారు. ట్రంప్ తరఫున ప్రచారం చేసి సార్వభౌమ దేశాలైన భారత్, అమెరికా రూపొందించుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ఈ మేరకు... ‘ మీరు అమెరికా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ కాదు. భారత ప్రధానిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ విషయాన్ని మీకు గుర్తు చేయాల్సి వస్తోంది. అమెరికా రాజకీయాల్లో భారత్ ఎల్లప్పుడూ తటస్థ వైఖరినే అనుసరించింది. రిపబికన్లు, డెమొక్రాట్లతో ఒకే విధమైన మైత్రి ఉండేది. కానీ మీరు వాటిని ఉల్లంఘించి ట్రంప్ తరఫున ప్రచారం చేస్తున్నారు. రెండు సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశాల విలువలు తుంగలో తొక్కారు. భారత దేశ విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేశారు’ అని ట్వీట్ చేశారు.
Mr Prime Minister, you have violated the time honoured principle of Indian foreign policy of not interfering in the domestic elections of another country. This is a singular disservice to the long-term strategic interests of India.
— Anand Sharma (@AnandSharmaINC) September 22, 2019
Comments
Please login to add a commentAdd a comment