
రాజ్యసభలో విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : పెట్టుబడుల ఆకర్షణ జాతీయ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ మరింత దిగజారింది. గత ఏడాది కంటే నాలుగు స్థానాల దిగువకు పడిపోయి 7వ ర్యాంక్‌కు చేరింది. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడైంది.
దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ వరసగా 7, 8 స్థానాల్లో నిలిచాయని మంత్రి చెప్పారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఏపీ నాలుగు ర్యాంకుల కిందకు పడిపోయిందని రాధాకృష్ణన్ వివరించారు. 2016లో 4వ ర్యాంక్, 2017లో 3వ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్.. 2018 నాటికి నాలుగు స్థానాలు దిగజారి 7వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు సుశిక్షితులైన శ్రామిక శక్తి, మౌలిక వసతుల లేమి, వ్యాపార, వాణిజ్యాలలో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణమే ఏపీ ర్యాంక్ పడిపోవడానికి కారణమని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment