
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల జరిగిన రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నా.. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్లు బాగా ఏర్పాటు చేశారని అభినందించారు. రేపటి నుంచి (మంగళవారం) కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మంగళవారం కౌంటింగ్ సిబ్బందికి అవగాహన ట్రైనింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకి 180 మంది చొప్పున మెత్తం కౌంటింగ్‌కు 25 వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కౌంటింగ్ రోజే (మే 23) ఏ ఉద్యోగి ఎక్కడ ఉంటారో తెలుస్తుందన్నారు. మే 23న మద్యం అమ్మకాలు బంద్ చేయాలని ఆదేశించారు.
మే 10న జరిగే మంత్రి వర్గ సమావేశంపై ఈసీ నియమాలు ఎలా ఉన్నాయో దాని ప్రకారమే అధికారులు నడుచుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే సీఎస్ ఆధ్యర్యంలోని కమిటీ పరిశీలించి సీఈవోకి పంపితే.. దానిని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం పంపుతానని తెలిపారు. గ్రూప్ 2 ప్రిలిమినరి పరీక్షలో ప్రభుత్వ పథకాల గురించి అడిగిన ప్రశ్నలపై ఫిర్యాదు అందిందని, దానిపై నివేదిక కోరామని ద్వివేది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment