
ఈవీఎంలకు మూడు సీళ్లు ఉంటాయి. ఏజెంట్ల సమక్షంలోనే..
సాక్షి, అమరావతి : ఈనెల 23న ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ప్రశాంతంగా కౌంటింగ్ జరిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విఙ్ఞప్తి చేశారు.
కౌంటింగ్ ప్రక్రియ గురించి వివరిస్తూ..‘ఈవీఎంలకు మూడు సీళ్లు ఉంటాయి. ఏజెంట్ల సమక్షంలోనే సీల్ ఓపెన్ చేస్తాం. అనుమానాలకు అవకాశం లేదు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తాం. కౌంటింగ్ కేంద్రంలో అవకతకలకు పాల్పడినా, గొడవలు సృష్టించినా ఎవరినీ ఉపేక్షించము’ అని హెచ్చరించారు. ‘ఫలితాలు తొందరగా ఇవ్వడం కాదు, కరెక్టుగా ఇవ్వడమే మా ముందున్న లక్ష్యం. మధ్యాహ్నం రెండు కల్లా ఈవీఎంల కౌంటింగ్ పూర్తవుతుంది. టేబుళ్లు, ఓట్లను బట్టి ముందు ఫలితం వెలువడుతుంది’ అని ద్వివేది పేర్కొన్నారు.