
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో చరిత్రాత్మకమైన బిల్లులను ప్రవేశపెట్టింది. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పిస్తూ.. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ. ఇక, నామినేషన్ పనుల్లోనూ, నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. తీసుకువచ్చిన కీలక బిల్లులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సభ ముందు ఉంచింది. పరిశ్రమల్లోని 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తూ.. ప్రతిపాదించిన బిల్లును మంత్రి గుమ్మనూరు జయరామ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కేటాయించాలని ప్రతిపాదించిన బిల్లును మంత్రి మంత్రి శంకర్ నారాయణ సభ ముందు ఉంచారు. దీంతోపాటు నామినేషన్ పనుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ.. ప్రతిపాదించిన బిల్లులను ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చరిత్రలో ఎన్నడూలేనివిధంగా అవకాశాలను కల్పించే దిశగా, మహిళలకు సమాన అవకాశాలు కల్పించేవిధంగా ఈ చరిత్రాత్మక బిల్లులను వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు రాద్ధాంతం చేయడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు మేలు చేకూర్చే బిల్లులను అడ్డుకోవాలని ప్రతిపక్షం చూస్తోందని, సభలో చరిత్రాత్మక బిల్లులను టీడీపీ అడ్డుకుంటోందని విమర్శించారు. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా? అని ఆయన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని నిలదీశారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన వారిని ప్రజలే శిక్షిస్తారని తేల్చి చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సమాన అవకాశం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్లు చరిత్రలో ఎప్పుడూ కల్పించలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇక, స్టేట్‌మెంట్ ఎక్కడైనా ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, దానికి క్లారిఫికేషన్ మాత్రమే ప్రతిపక్ష అడుగుతుందని ఆయన పేర్కొన్నారు.
చరిత్రాత్మకం.. విప్లవాత్మకం!
ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో వారికి 50 శాతం కేటాయించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అంతేకాకుండా ఈ కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సగం దక్కేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మిగిలిన 50 శాతంలో కూడా సగం మహిళలకే కేటాయించాలని నిర్ణయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వారికి పెద్దపీట వేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు వీలుగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పిస్తూ కూడా ముఖ్యమంత్రి మరో విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాలన్నింటికీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా రూపొందించిన బిల్లులను ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ ముసాయిదా బిల్లులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గత శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే.
ఈ చరిత్రాత్మక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘దేశ, రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం. మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం’ అని సీఎం వైఎస్ జగన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
దేశ,రాష్ట్ర చరిత్రలో ప్రథమం, సుదినం. మాట ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నాం. 50% అక్కచెల్లెమ్మలకు కేటాయించాం. శాశ్వత బీసీ కమిషన్ సహా, పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా అసెంబ్లీలో బిల్లులు పెట్టాం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019
Comments
Please login to add a commentAdd a comment