సాక్షి, తాడేపల్లి: పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్ కేంద్రం పనుల రివర్స్ టెండరింగ్‌తో సుమారు రూ. 780 కోట్లు ఆదా చేసి చరిత్ర సృష్టించామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. దివంగత మహానేత వైఎస్సార్ మానస పుత్రిక అయిన పోలవరాన్ని గడువులోగా పూర్తి చేస్తామన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరానికి సంబంధించి చంద్రబాబు హయాంలో ఇష్టారీతిన టెండర్లు ఇచ్చారని ఆరోపించారు.
అయితే, తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తుంటే.. టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దోచుకున్నదంతా బయటపడుతుందనే భయంతో రకరకాలుగా మాట్లాడుతున్నారని అనిల్ కుమార్ విమర్శించారు. 12.6 శాతం తక్కువతో పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొస్తే.. దానిని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మంత్రి ఏమన్నారంటే..
‘చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా కమీషన్ల కోసం పని చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ అనేది ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు మెచ్చుకోవాల్సింది పోయి అర్థంపర్థం లేకుండా విమర్శలకు దిగుతున్నారు. పోలవరాన్ని తాము చెప్పిన సమయానికే పూర్తి చేస్తే టీడీపీని మూసేస్తారా? పోలవరమే కాదు వెలిగొండ వంటి ప్రాజెక్టులపై కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళతాం. రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు. విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు.
అధిక ధరలకు టెండరింగ్ వేస్తే కట్టబెట్టినట్లా.. లేక తక్కువ ధరలకు టెండరింగ్ వేసి డబ్బు ఆదా చేస్తే కట్టబెట్టినట్లా?’ ఇప్పటివరకు రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 780 కోట్ల ఆదా అయింది. ఇంకా ఆదా అవుతుంది. మీరు బాగా పనిచేస్తుందని చెప్పే నవయుగ టెండర్లలలో ఎందుకు పాల్గొనలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయానికి మేము గర్వపడుతున్నాం’ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment