సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయస్థితిలో ఉన్నారన్నారు. 'చదవేస్తే ఉన్న మతిపోయిందని' అన్న చందంగా చంద్రబాబు పరిస్ధితి తయారైందన్నారు. బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంను టీడీపీ సన్మానించడంలో తప్పులేదు. కానీ.. చంద్రబాబు ధర్మాడికి లేఖ రాసి ఆ లేఖలో ప్రభుత్వాన్ని సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు. ‘ధర్మాడి సత్యం లాంటి వ్యక్తి మా కాకినాడలో ఉండడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అసలు బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యంకు అప్పగించింది మా ప్రభుత్వం కాదా..?’ అని ప్రశ్నించారు.
మీరు ధర్మాడికి రాసిన లేఖ సరైనదని భావిస్తే.. ఇంకెప్పుడూ రాజధాని కట్టానని, హైటెక్‌సిటీ కట్టానంటూ గొప్పలకు పోవద్దన్నారు. రాజధాని, హైటెక్‌సిటీ కట్టింది కాంట్రాక్టర్, తాపీ మేస్త్రీలు అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ‘బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలను బాధ్యతగల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎందుకు పరామర్శించలేకపోయారు..? మీ పార్టీ తరపున బోటు భాధితులకు సహాయక చర్యలు అందించారా..? గతంలో మీ హయాంలో జరిగిన పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి కారకులు మీరు కాదా’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment