kannababu kurasala
-
కరోనా వల్ల ఏ పంటల ధరలూ పడిపోలేదు
సాక్షి, అమరావతి: కరోనా వల్ల రాష్ట్రంలో ఏ పంటల ధరలూ తగ్గలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. అలాంటి వార్తలు రాసి రైతులకు నష్టం చేయవద్దని, కనీస సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ‘కరోనా పేరుతో ప్రజలను భయపెడతారా?.. శవాల గుట్టలంటూ దిగజారుడు కథనాలు రాయడం న్యాయమేనా?’ అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్న కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే.. పంటల ధరలు తగ్గాయని తప్పుడు ప్రచారం చేయడానికి ఇది సమయం కాదని హితవు పలికారు. టీడీపీ హయాం కన్నా ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగాయని అంకెలతో సహా వివరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోసం రెండు పత్రికలు శ్మశాన వార్తలు రాసేస్థాయికి దిగజారడం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. గుంటూరు శ్మశాన వాటికలో గుట్టలుగా కరోనా చితి మంటలని వార్తలు రాయడం వెనుక ప్రభుత్వంపై బురదజల్లే కుట్ర దాగి ఉందన్నారు. కరోనాపై ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి రోజూ బులెటిన్ విడుదల చేస్తుంటే మరణాలను దాచిపెడుతున్నట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. సీఎం జగన్ రైతు పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు పక్షపాతి. వ్యవసాయానికే ప్రాధాన్యమిస్తున్నారు. పంటల ధరలు పడిపోతున్నాయని ఈనాడులో రాయడం విడ్డూరం. రెండు రోజులు సెలవుల వల్ల గుంటూరు మిర్చి యార్డ్‌లో 4 లక్షల బస్తాల మిర్చి ఉంది. 26 నుంచి యార్డుకు మిర్చి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి మిర్చి ధర గతేడాది రూ. 11 వేల నుంచి రూ.12 వేలుంటే.. ఇప్పుడు రూ.15 వేలు ఉంది. çమిర్చిని కనీస మద్దతు ధర జాబితాలో చేర్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. పండ్ల ధరలెందుకు తగ్గుతాయి? మామిడి, బత్తాయి ధర తగ్గుతోందని ఆ పత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తవం. గతేడాది కన్నా ఈసారి మామిడి ఉత్పత్తి తగ్గింది. కరోనా, లాక్డౌన్ వల్ల మార్కెట్లు మూతపడటంతో గతేడాది రాష్ట్రంలో వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడా సమస్యే లేదు. ధర ఎందుకు తగ్గుతుంది? బత్తాయికి టన్నుకు ప్రభుత్వం రూ.14 వేలు మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్లో టన్ను రూ. 50 వేలు పలుకుతోంది. లాక్డౌన్ ఉండదని ప్రధానే ప్రకటించినప్పుడు.. ఎగుమతికి ఆటంకం లేనప్పుడు... ఇక ధర ఎందుకు తగ్గుతుంది? కందులు,పెసలు, మినుములు, శనగలు, వేరు శనగ, పత్తి, మిర్చి, ఉల్లి, బత్తాయి. పసుపు ఇవన్నీ కనీస ధర కన్నా ఎక్కువకే అమ్ముడుపోతున్నాయి. మొక్కజొన్నకు గతేడాది క్వింటాలు రూ.1,750 ఉంటే ప్రభుత్వం ఈ ఏడాది రూ.1,800 ప్రకటించింది. మార్క్‌ఫెడ్ ద్వారా పెద్ద ఎత్తున కొంటోంది. జొన్నకు గ్రేడ్ ఎంఎస్పీ పెట్టింది. ఏం పంటనూ గాలికొదిలేయలేదు. లోకేష్‌కు బుర్రలేదు కరోనా కష్టకాలంలో సీఎం జగన్ ప్రజలకు తోడుగా వారి వెంటే ఉన్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న నారా లోకేష్‌ను ప్రజలు బుర్రలేని నాయకుడు అని అంటున్నారు. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లు అత్యంత విలువైనవి. పరీక్షలు లేకుండా పాస్ చేస్తే వాటికి విలువ ఉంటుందా? అందుకే కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు జరపాలనుకుంటున్నాం. దీన్ని కూడా రాజకీయం చేస్తారా? కోవిడ్‌ను అడ్డుపెట్టుకుని ఆస్పత్రులు, మందుల షాపులు దోపిడీకి పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లోనే కొనుగోలు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే పంటలను కొనుగోలు చేస్తోందీ ప్రభుత్వం. ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు, ప్రకృతి వైపరీత్యాల నిధి కింద రూ.2 వేల కోట్లు ప్రకటించినప్పటికీ అంతకంటే ఎక్కువే ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో 2015–16 నుంచి 2018–19 వరకూ మొత్తం కొనుగోలు చేసిన పంటలు 8,50,823 మెట్రిక్ టన్నులు. దీనికి రూ.3,557 కోట్లు మాత్రమే చెల్లించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధాన్యం కాకుండా 2019–20, 2020–21లో 15,11,811 మెట్రిక్ టన్నుల రైతు ఉత్పత్తులను సేకరించి రూ.5,550 కోట్లు వెచ్చించింది. రూ.18 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రం 23 పంటలకు ఎంఎస్పీ ప్రకటిస్తే సీఎం వైఎస్ జగన్ అదనంగా మిర్చి పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలు అరటి. బత్తాయికి కనీస మద్దతు ధర ప్రకటించారు. చదవండి: రామోజీ రూటే వేరు...నిజాలెక్కడ? -
‘చంద్రబాబు.. మీరెందుకు పరామర్శించలేదు’
సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో తెలియని అయోమయస్థితిలో ఉన్నారన్నారు. 'చదవేస్తే ఉన్న మతిపోయిందని' అన్న చందంగా చంద్రబాబు పరిస్ధితి తయారైందన్నారు. బోటును వెలికితీసిన ధర్మాడి సత్యంను టీడీపీ సన్మానించడంలో తప్పులేదు. కానీ.. చంద్రబాబు ధర్మాడికి లేఖ రాసి ఆ లేఖలో ప్రభుత్వాన్ని సీఎం జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు. ‘ధర్మాడి సత్యం లాంటి వ్యక్తి మా కాకినాడలో ఉండడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అసలు బోటు వెలికితీత పనులను ధర్మాడి సత్యంకు అప్పగించింది మా ప్రభుత్వం కాదా..?’ అని ప్రశ్నించారు. మీరు ధర్మాడికి రాసిన లేఖ సరైనదని భావిస్తే.. ఇంకెప్పుడూ రాజధాని కట్టానని, హైటెక్‌సిటీ కట్టానంటూ గొప్పలకు పోవద్దన్నారు. రాజధాని, హైటెక్‌సిటీ కట్టింది కాంట్రాక్టర్, తాపీ మేస్త్రీలు అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ‘బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలను బాధ్యతగల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఎందుకు పరామర్శించలేకపోయారు..? మీ పార్టీ తరపున బోటు భాధితులకు సహాయక చర్యలు అందించారా..? గతంలో మీ హయాంలో జరిగిన పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి కారకులు మీరు కాదా’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
‘అర్హులైన రైతులందరికీ భరోసా’
కాకినాడ : అక్టోబర్ 15న రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలుస్తుందని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు. రైతులను కనీవిని ఎరుగని రీతిలో ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు.దేశంలోనే వైఎస్ఆర్ రైతు భరోసా పధకం ఓ సంచలనం కాబోతోందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు ఇస్తామన్న హామీని ముందుగానే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో సిఎం జగన్ రైతు భరోసా పధకాన్ని ప్రారంభిస్తున్నారని, రైతు అంటే గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్, రైతులకు ఉచిత విద్యుత్ అంటే చంద్రబాబు హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. మంత్రి కన్నబాబు ఆదివారం కాకినాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సిఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ యోజనతో అనుసంధానం చేసి వైఎస్ఆర్ రైతు భరోసా అమలు చేస్తున్నామని ఇందులో ఎలాంటి దాపరికం లేదని తేల్చిచెప్పారు. రైతు భరోసాపై టీడీపీ అధినేత చంద్రబాబు మొదలు ఆ పార్టీ నేత ధూళిపాళ నరేంద్ర వరకు లేనిపోని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. రూ. 84 వేలకోట్లు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు.. రూ.24 వేలకోట్లకు కుదించారని చివరికి రూ. 15 వేల కోట్లు రుణమాఫి చేయడానికి తీసుకున్న రుణాలను కూడా దారి మళ్లించారని మంత్రి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను దారిమళ్లించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిదేనని అన్నారు. 7 లక్షల మంది కొత్త రైతులు రైతు భరోసాలో పేర్లు నమోదు చేసుకున్నారని, పిఎం కిసాన్ యోజన పధకంలో అర్హత లేని పేర్లు నమోదయ్యాయని అవి చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చినవేనని అన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా సాయం అందాలన్నది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని స్పష్టం చేశారు. రైతు నమోదు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, అర్హతలేని కొందరి పేర్లు నమోదయినట్టు గుర్తించామని చెప్పారు. అలాగే కొందరు మృతి చెందిన రైతుల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నాయరని, వాటిని అన్నింటిని పరిశీలించి వైఎస్ఆర్ రైతు భరోసా పధకాన్ని అందిస్తామని చెప్పారు. -
‘పథకాలను చూసి ఆశ్చర్యపడ్డారు’
సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా సీడ్ పార్క్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. సోమవారం అయోవా యూనివర్శిటీ ప్రతినిధులతో మంత్రి కన్నబాబు, సీఎం కార్యాలయం అధికారులు భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా సీడ్ పార్క్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విత్తన కంపెనీలకు మేలు చేసేలా కాకుండా.. రైతులకు మేలు చేసేలా విత్తనాభివృద్ధి జరగాలని కోరారు. అదే విషయాన్ని ఆయోవా ప్రతినిధులకు సూచించినట్లు వెల్లడించారు. సీడ్‌పార్క్ ప్రతిపాదనలను రిడిజైన్ చేయాలని చెప్పామన్నారు. రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా విత్తనాభివృద్ధి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన రైతు పథకాలను చూసి అయోవా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. విత్తనాలు అందించడానికి ల్యాబ్‌లను పెడుతున్నామని తెలిపారు. -
శోక సంద్రం.. కన్నబాబు నివాసం
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కురసాల సురేష్‌బాబు (46) ఆకస్మిక మరణం ఆయన కుటుంబాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోక సంద్రంలో ముంచి వేసింది. విజయవాడలో బుధవారం రాత్రి అకస్మాతుగా గుండెపోటు వచ్చి కురసాల సురేష్ మరణించారు. ఈ సమాచారం తెలియగానే గురువారం ఉదయం నుంచి పార్టీ శ్రేణులతోపాటు, కుటుంబ సభ్యులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు రమణయ్యపేట సమీపంలోని వైద్య నగర్‌లోని కన్నబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. పదేళ్లపాటు జర్నలిస్టుగా తన కెరీర్లో ఎన్నో మంచి విజయాలు సాధించి వ్యాపార రంగంలో స్థిరపడిన సురేష్ బాబు మరణాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. సోదరుడి మరణ వార్త విన్న కన్నబాబు కొద్దిసేపు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మంత్రి కన్నబాబు కాకినాడ చేరుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో కన్నబాబు నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆరంభంలో సురేష్‌బాబు ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో అప్పటి వరకూ ఉనికి కూ డా లేని ఓ గ్రామానికి కాలినడకన వెళ్లి, ఆ గ్రామాన్ని వెలుగులోకి తెచ్చారని అక్కడి వచ్చిన ఆయన స్నేహితులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు. కన్నీటి వీడ్కోలు మంత్రి కన్నబాబు సోదరుడు కురసాల సురేష్‌బాబుకు కుటుంబ సభ్యులు, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కురసాల కన్నబాబు నివాసం నుంచి హిందూ శ్మశానవాటిక వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. సురేష్ తండ్రి కురసాల సత్యనారాయణ, తల్లి కృష్ణవేణి కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి చూసి అక్కడికి వచ్చిన వారందరూ చలించిపోయారు. చిన్న వయస్సులోనే సురేష్‌బాబు దూరమైన నేపథ్యంలో ఆయన భార్య చైతన్య, కుమార్తెలు కృష్ణ సంవేద, ఆధ్యశ్రీ శరత్ గీతలను పలువురు ఓదార్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉదయం నుంచి అక్కడే ఉండి కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సురేష్‌బాబుతో మంత్రి కురసాల కన్నబాబు కుటుంబ సభ్యులు ప్రముఖుల పరామర్శ సోదరుడు కురసాల సురేష్‌బాబు మరణంతో దుఃఖ సాగరంలో ఉన్న కన్నబాబుకు పలువురు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో తన సానుభూతి తెలియజేశారు. జిల్లా మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, కాకినాడ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ మేయర్ సుంకర పావని, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో–ఆర్డినేటర్ తోట వాణి, కాకినాడ ఆర్డీవో రాజకుమారితోపాటు, వ్యవసాయ, సహకార శాఖలకు చెందిన పలువురు అధికారులు, పార్టీ ప్రముఖులు కన్నబాబును పరామర్శించారు. మంత్రి వెల్లంపల్లి సంతాపం దేవదాయ, ధర్మాదాయశాఖా మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి కురసాల కన్నబాబుకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. జర్నలిస్టుగా కురసాల సురేష్ తన ప్రస్థానంలో ఎన్నో మంచి విజయాలు సాధించి సమాజాన్ని చైతన్యవంతం చేశారని కొనియాడారు. ఆయన మరణం కన్నబాబు కుటుంబానికి తీరని లోటని వెల్లంపల్లి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. -
‘ప్రతిపక్షానికి ఎంత సమయమైనా ఇస్తాం’
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రతిపక్షాలకు కావాల్సినంత సమయం ఇస్తామని మంత్రి కన్నబాబు అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన విధంగా మైక్ కట్ చేయడం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం లాంటి పనులను తాము చేయమన్నారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. బీఏసీ సమావేశం చాలా అర్థవంతంగా జరిగిందన్నారు. సభలో మొత్తం 23 అంశాల మీద చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాజధాని భూ కేటాయింపు వంటి ముఖ్య అంశాలతో పాటు అగ్రిగోల్డ్, కె టాక్స్, ఉద్యోగుల సంక్షేమం, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలు మీద చర్చ ఉంటుందని తెలిపారు. సభ అనుకున్న సమయం కంటే ఎక్కువ రోజులు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ ఎన్నిరోజులు జరపాలని సీఎం జగన్ ప్రతిపక్ష సభ్యులు అచ్చెన్నాయుడిని అడిగితే.. సమధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. -
జిల్లా ఇన్చార్జి మంత్రిగా కన్నబాబు
సాక్షి, విజయవాడ : జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబును ప్రభుత్వం నియమించింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొంది మంత్రివర్గంలో స్థానం సాధించారు. డీఆర్సీ ఏర్పాటు చేసి సమీక్ష చేసే అధికారం ఉంది. ప్రతి మూడు నెలలకు డీఆర్సీ జరగాల్సి ఉంటుంది. పక్కా గృహాల మంజూరు, ఇతర పథకాల మంజూరుకు అవకాశం ఉంటుంది. పాత్రికేయుడిగా పనిచేసిన కన్నబాబుకు పలు అంశాలపై మంచి అవగాహన ఉంది. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పేర్ని నానికి రాజధాని పరిధిలోని గుంటూరు జిల్లా ఇన్చార్జిగా, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు శ్రీకాకుళం జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. -
రేపు ‘బాబు’పై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు పిలుపు కాకినాడ : ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఈ నెల 8వ తేదీన పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లోని మెయిన్‌రోడ్డు లేదా ప్రధాన కూడళ్ళల్లో పార్టీ శ్రేణులంతా సమావేశమై రెండేళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలను వంచించిన తీరుపై చైతన్యవంతం చేయాలన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన దగాకోరు తనాన్ని ఎండకట్టాలన్నారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమీపంలోని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు ముఖ్యనేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. -
బాబు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలి: కన్నబాబు
కాకినాడ : ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్షాన్ని తక్షణమే ఢిల్లీ తీసుకు వెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో ప్రత్యేక హోదాపకై సీపీఐ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కన్నబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విభజన చట్టంలోని హామీలు ఏ మేరకు అమలు చేశారని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కన్నబాబు కోరారు.