సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి) : రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు కురసాల సురేష్‌బాబు (46) ఆకస్మిక మరణం ఆయన కుటుంబాన్ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోక సంద్రంలో ముంచి వేసింది. విజయవాడలో బుధవారం రాత్రి అకస్మాతుగా గుండెపోటు వచ్చి కురసాల సురేష్ మరణించారు. ఈ సమాచారం తెలియగానే గురువారం ఉదయం నుంచి పార్టీ శ్రేణులతోపాటు, కుటుంబ సభ్యులు, ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు రమణయ్యపేట సమీపంలోని వైద్య నగర్‌లోని కన్నబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను కలిసి తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు.
పదేళ్లపాటు జర్నలిస్టుగా తన కెరీర్‌లో ఎన్నో మంచి విజయాలు సాధించి వ్యాపార రంగంలో స్థిరపడిన సురేష్ బాబు మరణాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. సోదరుడి మరణ వార్త విన్న కన్నబాబు కొద్దిసేపు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో మంత్రి కన్నబాబు కాకినాడ చేరుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో కన్నబాబు నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆరంభంలో సురేష్‌బాబు ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో అప్పటి వరకూ ఉనికి కూ డా లేని ఓ గ్రామానికి కాలినడకన వెళ్లి, ఆ గ్రామాన్ని వెలుగులోకి తెచ్చారని అక్కడి వచ్చిన ఆయన స్నేహితులు కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.
కన్నీటి వీడ్కోలు
మంత్రి కన్నబాబు సోదరుడు కురసాల సురేష్‌బాబుకు కుటుంబ సభ్యులు, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కురసాల కన్నబాబు నివాసం నుంచి హిందూ శ్మశానవాటిక వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. సురేష్ తండ్రి కురసాల సత్యనారాయణ, తల్లి కృష్ణవేణి కుమారుడు మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి చూసి అక్కడికి వచ్చిన వారందరూ చలించిపోయారు. చిన్న వయస్సులోనే సురేష్‌బాబు దూరమైన నేపథ్యంలో ఆయన భార్య చైతన్య, కుమార్తెలు కృష్ణ సంవేద, ఆధ్యశ్రీ శరత్ గీతలను పలువురు ఓదార్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉదయం నుంచి అక్కడే ఉండి కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
సురేష్‌బాబుతో మంత్రి కురసాల కన్నబాబు కుటుంబ సభ్యులు
ప్రముఖుల పరామర్శ
సోదరుడు కురసాల సురేష్‌బాబు మరణంతో దుఃఖ సాగరంలో ఉన్న కన్నబాబుకు పలువురు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో తన సానుభూతి తెలియజేశారు. జిల్లా మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, కాకినాడ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ మేయర్ సుంకర పావని, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, వైఎస్సార్ సీపీ పెద్దాపురం కో–ఆర్డినేటర్ తోట వాణి, కాకినాడ ఆర్డీవో రాజకుమారితోపాటు, వ్యవసాయ, సహకార శాఖలకు చెందిన పలువురు అధికారులు, పార్టీ ప్రముఖులు కన్నబాబును పరామర్శించారు.
మంత్రి వెల్లంపల్లి సంతాపం
దేవదాయ, ధర్మాదాయశాఖా మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి కురసాల కన్నబాబుకు తన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. జర్నలిస్టుగా కురసాల సురేష్ తన ప్రస్థానంలో ఎన్నో మంచి విజయాలు సాధించి సమాజాన్ని చైతన్యవంతం చేశారని కొనియాడారు. ఆయన మరణం కన్నబాబు కుటుంబానికి తీరని లోటని వెల్లంపల్లి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment