సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితం, చరిత్ర ముగిసిన అధ్యాయమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇక ఆయన కుట్రలు సాగవన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మీడియాతో మాట్లాడారు. బొత్స ఏమన్నారంటే..
► చంద్రబాబు అనుకున్నవన్నీ ఇక జరగవు.
► రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేదని తెలిసినా చంద్రబాబు పోటీపెట్టడం నీచం.
► గతంలో సంఖ్యా బలం ఉన్నప్పుడు చంద్రబాబుకు దళితులు ఎందుకు గుర్తురాలేదు?
► గవర్నర్ ప్రసంగం వినటం ఇష్టంలేని చంద్రబాబు, గవర్నరును ఎలా కలుస్తారు?
► చంద్రబాబు రాజకీయ పుస్తక పేజీ చినిగిపోయింది. ఇక కొత్త పేజీలు లేవు.
► ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం పార్టీ చూసుకుంటుంది.
రాష్ట్రంలో బీసీలకు సమన్యాయం
► చంద్రబాబు గతంలో బీసీలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక మోసం చేశారు.
► అప్పట్లో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారేగానీ, బీసీలు చంద్రబాబుకు గుర్తురాలేదు.
► ఈరోజు వైఎస్సార్‌సీపీ బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించడంతో రాష్ట్రంలో ఆ వర్గానికి సమన్యాయం జరిగింది.
– ధర్మాన కృష్ణదాస్, ఆర్ అండ్ బీ మంత్రి
వర్ల రామయ్యను బలిపశువును చేశారు
► రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కూడా ఏ దురుద్దేశంతో చంద్రబాబు తన అభ్యర్థిని బరిలో దించారు?
► చంద్రబాబు గతంలో వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆ తర్వాత తన సామాజిక వర్గానికి కట్టబెట్టారు.
► ఇప్పుడు మరోసారి చంద్రబాబు ఆయన్ను బలిపశువును చేశారు.
► టీడీపీ.. శాసన మండలిలో వాపును చూసి బలుపు అని అనుకుంటోంది.
– ఆర్కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్
మళ్లీ ఎస్సీ నేతను కించపరచాలనే నిలపెట్టారు
► రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే మెజార్టీ లేకపోయినా ఎస్సీ నేతను మళ్లీ కించపరచాలనే ఉద్దేశంతోనే నిలబెట్టినట్లుగా అనిపిస్తోంది.
► చంద్రబాబుకు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలపై నిజంగా ప్రేమ ఉంటే ఆ రోజుల్లోనే రాజ్యసభకు పంపేవారు.
► నాలుగు రాజ్యసభ స్థానాలుంటే అందులో రెండు స్థానాలను బలహీనవర్గాలకు చెందిన వ్యక్తులకు కేటాయించిన అభినవ ఫూలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
– జోగి రమేష్, ఎమ్మెల్యే
లోకేశ్‌తో ఎందుకు పోటీ చేయించలేదు
► ఓడిపోయే సీటులో మంగళగిరి మా లోకం అయిన నారా లోకేశ్ నాయుడును ఎందుకు పోటీచేయించలేదు?
► దళిత జాతికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారు.
► బాబు తన కుమారుడు లోకేశ్‌ను గెలిచే స్థానంలో ఎమ్మెల్సీగా పోటీచేయించి ఆ తరువాత అడ్డదారిలో మంత్రిని చేశారు.
– నందిగం సురేష్, బాపట్ల ఎంపీ
దళితులను పావులుగా వాడుకుంటున్నారు
► గెలిచే దానికి చంద్రబాబు కుమారుడు.. ఓడిపోయే దానికి దళితులు అన్నది చంద్రబాబు సిద్ధాంతం.
► గతంలో చంద్రబాబు పక్కా ప్లాన్‌తో పుష్పరాజ్, మాజీమంత్రి ఎం నరసింహులుతో పాటు పలువురికి మోసం చేశారు.
► దళితులను పావులుగా వాడుకుంటున్నారు.
► చంద్రబాబు దుర్మార్గపు, కుట్రపూరిత బుద్ధి ఇంకా మారలేదు.
– ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్యే
ఓడిపోతారని తెలిసీ పోటీ
► మాట్లాడితే తనది 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఓడిపోతారని తెలిసీ పోటీకి వర్ల రామయ్యను ఎలా నిలిపారు?
► ఉద్దేశపూర్వకంగా ఆయన పరువు తీయటంతో పాటు దళిత జాతిని బాబు తీవ్రంగా అవమానించారు.
► చంద్రబాబు తీరును ప్రజలంతా గమనిస్తున్నారు.
► పేదలకు ఇంత అండగా నిలబడిన సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగనే.
– మద్దాల గిరి, ఎమ్మెల్యే
బీసీలకు అత్యధిక గౌరవం
► సీఎం వైఎస్ జగన్ బీసీలకు రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించడంతో రాష్ట్రంలో బీసీలకు అత్యధిక గౌరవం దక్కింది.
► బీసీలకు సమన్యాయం జరిగింది.
► గెలిచే స్థానాలు తన సామాజికవర్గానికి.. గెలవని స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వటం చంద్రబాబు నైజం.
► ఓడిపోతాం అని తెలిసి కూడా చంద్రబాబు వర్ల రామయ్యకి ఇచ్చి ఆయన్ను బలిపశువును చేశారు.
– కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే
‘ప్రతిపక్ష’ హోదా పోయిన స్థితి చంద్రబాబుది
► చంద్రబాబు రాజకీయ జీవితం, చరిత్ర అంతా ఇక ముగిసినట్లే.
► రాజ్యసభ ఎన్నికల ద్వారా ప్రతిపక్ష నేత హోదా పోయే స్థితికి తెచ్చుకున్నారు. ఇక చంద్రబాబు డెన్ ఖాళీ అయినట్లే.
► ఇప్పటికైనా బాబు బుద్ధి తెచ్చుకోవాలి. బాబు కొన్ని వార్తా పత్రికలను, సామాజిక మాధ్యమాలను, చెంచాలను దూరం పెట్టాలి.
► నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.. మళ్లీ నువ్వు రావాలి ఓటేయ్యాలని ఎలా విప్ జారీచేస్తారు?
► ఇక చంద్రబాబు కుట్రలు సాగవు.
– వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే
గెలిచేటపుడు ధనికులకు.. ఓడేటపుడు ఎస్సీలకా!?
ఇదేనా మీ వైఖరి బాబూ..
బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యేల వ్యాఖ్యలు
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు వైఖరిని ప్రశ్నిస్తూ తమ బ్యాలట్ పత్రంపై రాసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేటప్పుడేమో సుజనా చౌదరి, కనకమేడల చౌదరి, గరికపాటి, సీఎం రమేష్ లాంటి ధనవంతులకు టికెట్లు కేటాయిస్తారా? ఏ మాత్రం బలం లేనపుడు.. ఓటమి ఖాయమైనప్పుడు ఎస్సీలను (వర్ల రామయ్య) పోటీచేయిస్తారా? ఇదేనా మీ వైఖరి చంద్రబాబూ! అని ఓ ఎమ్మెల్యే తన బ్యాలట్‌పై రాశారు. దీంతో ఈ ఓటు చెల్లకుండా పోయింది. అలాగే.. మరో ఎమ్మెల్యే అయితే చంద్రబాబు ఐదేళ్ల దోపిడీ విధానాలను ప్రశ్నించారు. ‘‘ఐదేళ్ల నీ పాలనలో అడ్డగోలుగా దోపిడీ చేసి, రాష్ట్రాన్ని అప్పులపాల్జేసింది చాలక, గెలవలేనని తెలిసి మళ్లీ రాజ్యసభలో అభ్యర్థిని పోటీచేయిస్తావా?’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment