సాక్షి, న్యూఢిల్లీ: పండగ వాతావరణం మధ్య 17వ లోక్‌సభ సోమవారం కొలువుదీరింది. తొలిరోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రివర్గ సభ్యులు, అక్షర క్రమంలో పలు రాష్ట్రాల సభ్యులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అక్షర క్రమంలో మొదట అండమాన్ నికోబార్ దీవుల ఎంపీ, అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీలు పార్టీ కండువా ధరించి రావడం ఆకట్టుకుంది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంపీల బంధువులు, మిత్రులు, పార్టీల నేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్ లోక్‌సభలోని రాజ్యసభ ఎంపీల గ్యాలరీ నుంచి వీక్షించారు. ఆంధ్రప్రదేశ్ సభ్యుల్లో 12 మంది మాతృభాష అయిన తెలుగులోనూ, 11 మంది ఇంగ్లీషులోనూ, ఇద్దరు హిందీలోనూ ప్రమాణ స్వీకారం చేశారు.
12 మంది తెలుగులో..
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి (వైఎస్సార్‌సీపీ), విశాఖపట్నం ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ (వైఎస్సార్‌సీపీ), అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి వెంకట సత్యవతి (వైఎస్సార్‌సీపీ), కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ (వైఎస్సార్‌సీపీ), రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (వైఎస్సార్‌సీపీ), బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ (వైఎస్సార్‌సీపీ), అనంతపురం ఎంపీ తలారి రంగయ్య (వైఎస్సార్‌సీపీ), కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప (వైఎస్సార్‌సీపీ) తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్‌సీపీ), మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి (వైఎస్సార్‌సీపీ) పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం: పీవీ మిథున్‌రెడ్డి
ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘మాకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకుంటాం. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చడం, ప్రత్యేక హోదా సాధించడం లక్ష్యంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకోవడమే తప్ప.. పదవుల కోసం వెంపర్లాడే ప్రసక్తి లేదు. ప్రత్యేక హోదా కోసమే పోరాడుతాం..’ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. కర్నూలు ఎంపీ డా. సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుడిగా పనిచేస్తూ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతామన్నారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. చింతలపూడి ప్రాజెక్టు పూర్తికి పనిచేస్తామని, భూ సేకరణ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
11 మంది ఇంగ్లీషులో...
రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (వైఎస్సార్‌సీపీ), ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ (వైఎస్సార్‌సీపీ), విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (టీడీపీ), గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ (టీడీపీ), నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(వైఎస్సార్‌సీపీ), ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (వైఎస్సార్‌సీపీ), నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి(వైఎస్సార్‌సీపీ), కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్ (వైఎస్సార్‌సీపీ), హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (వైఎస్సార్‌సీపీ) ఇంగ్లీషులో దైవ సాక్షిగానూ, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు (వైఎస్సార్‌సీపీ) సత్యనిష్టతో ప్రమాణం చేశారు. కాగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు (టీడీపీ), అమలాపురం ఎంపీ అనురాధ (వైఎస్సార్‌సీపీ) హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment