
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా మరోపక్క ఆర్థిక శాఖ అధికారులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేశారు. ఫలితాలకు ముందు రోజైన బుధవారం, ఫలితాలు వెల్లడించిన గురువారం నాడు మొత్తం రూ.2,325 కోట్ల మేర బిల్లులను చెల్లించేశారు. ఫలితాల సమయంలో చంద్రబాబు చెప్పిన రంగాలకు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇష్టానుసారంగా బిల్లులు చెల్లించడంపై ఆర్థిక శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
పెండింగ్‌లో రూ.15 వేల కోట్ల బిల్లులు
చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులు పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడిపోయాయి. ఇప్పుడు రూ.15,000 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే సమయంలో కూడా ఆర్థిక శాఖ అధికారులు చంద్రబాబు చెప్పినట్లు తలూపుతూ నీరు–చెట్టుకు బిల్లులు చెల్లించడంపై నివ్వెరపోతున్నారు.
ఇతర బిల్లులు పెండింగ్‌లో పెట్టి మరీ..
టీడీపీ నేతలు, కార్యకర్తల జేబులు నింపే నీరు–చెట్టు పథకం బిల్లులను కొత్త ప్రభుత్వం అనుమతించదనే భయంతోనే చంద్రబాబు హడావిడిగా చెల్లించాలని, ఒకపక్క ఫలితాలు వెలువడుతుండగా ఆర్థిక శాఖ కార్యదర్శులు దీన్ని ఆమోదించడం ఏమిటని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ప్రశ్నించారు. వ్యవసాయానికి చెందిన బిల్లులతో పాటు ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టి మరీ అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం ఏమిటని అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే మే నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాలను జూన్ 1వ తేదీన చెల్లించడానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన ఆర్థిక శాఖ కార్యదర్శులు ఖజానాను ఖాళీ చేసేశారని, బుధవారం రూ.700 కోట్ల మేర ఓవర్ డ్రాఫ్ట్‌కు కూడా వెళ్లి బిల్లులు చెల్లించారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
వేతనాలకు నగదు నిల్వ ఏది?
దిగిపోయే ముందు టీడీపీ సర్కారు ఈ నెలలో ఇక అప్పు చేయడానికి కూడా వెసులుబాటు లేకుండా ఫలితాలు వెల్లడికి ముందు ఓపెన్ మార్కెటింగ్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. వచ్చే నెలలో ఇక రూ.1,000 కోట్లు మాత్రమే ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పు చేయడానికి వీలుంది. జూన్ 1వ తేదీన వేతనాలు చెల్లించాలంటే రూ.4,500 కోట్లు అవసరం. ఈ వేతనాలను ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా వేతనాల కోసం 20వతేదీ నుంచి ఎలాంటి బిల్లులు చెల్లించకుండా నగదు నిల్వ చేస్తారు. అయితే ఆర్థిక శాఖ కార్యదర్శులు ఇందుకు భిన్నంగా వ్యవహరించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఫలితాల రోజు రూ.300 కోట్ల బిల్లుల చెల్లింపు
సాధారణంగా ప్రాధాన్యతా విధానంలో సీఎఫ్‌ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లించాల్సిన ఆర్థిక శాఖ ఎన్నికల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ చంద్రబాబు చెప్పిన అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులను చెల్లించింది. ఫలితాల ముందు రోజు ఏకంగా రూ.2,025 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెల్లించారు. ఇందులో అత్యధికంగా నీరు–చెట్టు బిల్లులేనని జిల్లా ట్రెజరీ వర్గాలు పేర్కొన్నాయి. ఒక్కో జిల్లాకు రూ.20 కోట్లకు పైగా నీరు– చెట్టు బిల్లులను చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫలితాల రోజైన గురువారం కూడా రూ.300 కోట్ల బిల్లులను ఆర్థిక శాఖ చెల్లించేసింది. ఆర్థిక శాఖ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లి మరీ చంద్రబాబు చెప్పిన రంగాలకు బిల్లులు చెల్లించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment