
అసదుద్దీన్ ఒవైసీ.. పక్కన కవాతు చేస్తున్న సైనికులు (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. సైనికులను తాము ఎప్పుడూ మత దృష్టితో చూడలేదని.. ఆ పని మీలాంటి వాళ్లు చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించింది. మా దృష్టిలో అంతా సమానమే.. కానీ, కొందరు మాత్రం ఆ పని చేస్తున్నారంటూ పరోక్షంగా ఒవైసీకి చురకలు అంటించింది.
సైన్య ఉత్తర విభాగం లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్భు బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ‘మేం మా సైన్యాన్ని మత కోణంలో ఏనాడూ చూడం. సర్వ ధర్మ స్థల్ అనే సూత్రాన్ని పాటిస్తాం. కానీ, కొందరు నేతలు మాత్రం ఆ పని చేస్తున్నారు. అమర వీరులకు మత రంగును అద్ది లబ్ధి పొందాలని చూస్తున్నారు. భారత్ సైనికులకు మతం ఉండదనే విషయం బహుశా వారికి తెలీక పోవచ్చు. వారి దేశభక్తిని వారి విజ్ఞతతకే వదిలేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
కాగా, సంజువాన్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన అమర జవానులలో ఐదుగురు ముస్లింలు ఉన్నారని అసదుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ముస్లింల జాతీయతను సోకాల్డ్ జాతీయవాదులు పదేపదే ప్రశ్నిస్తుంటారు. సంజువాన్ ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన ఏడుగురిలో ఐదుగురు కశ్మీరీ ముస్లింలు ఉన్నారు. దేశం పట్ల మాకున్న చిత్తశుద్ధి, ప్రేమను ప్రశ్నించేవారందరికీ ఈ ఉదంతం కనువిప్పు కావాలి. దేశం కోసం ముస్లింలు ప్రాణత్యాగాలు చేస్తున్నా పాకిస్తానీయులు అంటూ ముద్ర వేస్తున్నారు. దేశం పట్ల విధేయతను రుజువు చేసుకోవాలని ఇప్పటికీ ముస్లింలను అడుగుతున్నార’ని అసదుద్దీన్ వ్యాఖ్యలు చేయటంతో వివాదాస్పదంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment