పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న ముస్లింలు
సాక్షి, గుంటూరు/గుంటూరు ఈస్ట్/నెహ్రూ నగర్(గుంటూరు): ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే నిరసన తెలపడం, తమకు న్యాయం చేయండి అని శాంతియుతంగా విన్నవించుకోవడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కును కాలరాస్తూ, తమ ను ప్రశ్నించే గళాలను ఉక్కుపాదంతో అణచివేస్తున్న టీడీపీ ప్రభుత్వ పాల కుల తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటానని నమ్మబలుకుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో న్యాయం కోసం నినదించడంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించిన 8 మంది ముస్లిం యువకులను దాదాపు 24 గంటలపాటు అక్రమంగా నిర్బంధించింది. అక్రమ కేసులు బనాయించింది. చివరకు ముస్లింల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అరెస్టు చేయడం టీడీపీ ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమని బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభకు రాష్ట్రంలోని ముస్లింలంతా హాజరు కావాలని కోరిన ప్రభుత్వం.. కొందరు యువకులు మాత్రం కుట్రతోనే సభకు వచ్చారంటూ మాయమాటలు చెబుతుండడం గమనార్హం.
‘‘ముస్లింలపై మూకదాడులు జరగకుండా రక్షణ కల్పిస్తా.. అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకొస్తా.. ముస్లిం సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటా.. వారి జోలికి ఎవరు వచ్చినా సహించేది లేదు’’... ఇదీ గుంటూరు బీఆర్ స్టేడియంలో మంగళవారం ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన. 24 గంటలు కూడా గడవక ముందే తనకు ముస్లింలపై ఉన్నది కపట ప్రేమేనని బాబు నిరూపించారు. తమ సమస్యలను పరిష్కరించడానికి తెలుగుదేశం ప్రభుత్వ కేబినెట్‌లో ఒక్క ముస్లింకు కూడా స్థానం కల్పించలేదంటూ సభలో శాంతియుతంగా ఫ్లకార్డులతో నిరసన తెలిపిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన 8 మంది ముస్లిం యువకులతోపాటు వారిని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లాను స్థానిక టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పాతగుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఎస్‌కే జుబేదార్, ఎస్‌కే ఇలియాజ్, ఎస్‌కే ముఖ్తు, ఎస్‌కే మొహమ్మద్ ముజాయిద్దీన్, ఎస్‌కే మహబూబ్ బాషా, ఎస్‌కే జుబేదార్ అహ్మద్, హబీబుల్లా, షేక్ అక్తర్ సల్మాన్, జక్రియా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సభలో కుట్రపూరితంగా గొడవ చేశారంటూ వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
మేం గొడవ చేయడానికి రాలేదు
బాధిత యువకుల కుటుంబ సభ్యులు పలువురు గుంటూరుకు చేరుకున్నారు. తమవారిపై అక్రమంగా కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాము సీఎం సభలో గొడవ చేయడానికి రాలేదని, కేవలం తమ సమస్యలను ఏకరువు పెట్టుకునేందుకు, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చామని యువకులు మొరపెట్టుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఇందులో ఏదో కుట్ర దాగుందనే కోణంలో విచారిస్తున్నామంటూ బుధవారం రాత్రి వరకూ హడావిడి చేశారు. ఈ పరిణామంపై ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో బుధవారం రాత్రి హడావిడిగా అరెస్టు చూపి రిమాండ్‌కు పంపారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా సీఎం చంద్రబాబు, హిట్లర్‌ను తలపిస్తున్నారని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి.
పరామర్శించడమూ నేరమేనా?
తమ ప్రాంతానికి చెందిన ముస్లిం యువకులపై అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురి చేస్తున్నట్టు తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హబీబుల్లా బుధవారం వారిని పరామర్శించేందుకు గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. సీఎం సభలో గొడవకు కారకుడంటూ హబీబుల్లాను సైతం పోలీసులు అక్రమంగా నిర్బంధించడంతోపాటు కేసు బనాయించి అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సభలో శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు వారిని పరామర్శించేందుకు వచ్చిన హబీబుల్లాను కూడా కేసులో ఇరికించడంపై గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫా, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసరావును కలిసి, అమాయకులపై అక్రమ కేసులు బనాయించవద్దని కోరారు.
ముస్లింల అరెస్టు అప్రజాస్వామికం
తమ మతస్తులకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. వారు బుధవారం గుంటూరులో మీడియాతోనూ, జిల్లా పార్టీ కార్యాలయంలో నగర డివిజన్ అధ్యక్షుల సమావేశంలోనూ మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రులు నిర్వహించిన సభల్లో ఎంతోమంది పౌరులు తమ సమస్యలపై నిరసనలు తెలియజేశారని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వాలు వారిని అరెస్టులు చేయలేదని గుర్తు చేశారు. నేడు టీడీపీ ప్రభుత్వం ముస్లిం యువకులను అరెస్టు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. సీఎం సభలో మైనార్టీ మంత్రిని ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తే చివరికి మొండి చెయ్యి ఎదురైందని ఎద్దేవా చేశారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలా అన్యాయం చేసిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. ముస్లిం యువకులను అరెస్టు చేసి, భయబ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇలాంటి అణచివేత చర్యలను మానుకోకపోతే ప్రజలు టీడీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.
పథకం ప్రకారమే సభలో అల్లరి సృష్టించారు: డీఎస్పీ
సాక్షి, గుంటూరు: ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో నంద్యాలకు చెందిన కొందరు యువకులు పథకం ప్రకారమే అల్లరి సృష్టించారని, కుట్రపూరితంగా ప్లకార్డులు ప్రదర్శించి గొడవ చేశారని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ కండె శ్రీనివాసులు బుధవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. సీఎం సభలో గందరగోళం సృష్టించాలని 8 మంది యువకులు హబీబుల్లా అనే నాయకుడి ఆధ్వర్యంలో వారం ముందుగానే నిర్ణయించుకున్నారని తెలిపారు. వారు ఈ నెల 27వ తేదీ రాత్రి నంద్యాల నుంచి రైలులో బయల్దేరి 28వ తేదీ ఉదయం గుంటూరు చేరుకున్నారని వెల్లడించారు. ఎక్కడో తలదాచుకుని మీటింగ్ సమయానికి వచ్చి అల్లర్లు సృష్టించారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని, 258 క్రైమ్ నంబరు ప్రకారం 505 క్లాస్ 1బీ, 505 క్లాస్ 2, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించామని అన్నారు.
ఆ ప్లకార్డుల్లో ఏముంది?
గుంటూరులో మంగళవారం నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ముస్లింలు తమ డిమాండ్లను తెలియజేస్తూ పలు ప్లకార్డులు పదర్శించారు. ‘వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. ఉర్దూ మీడియం పాఠశాలలు ఏర్పాటు చేయాలి. మదర్సా విద్యార్థులకు స్కాలర్‌షిప్ సౌకర్యం కల్పించాలి. టీడీపీలోని ముస్లిం నాయకత్వాన్ని మరచిన చంద్రబాబు. నారా హమారా నహీ.. ముస్లింలకు టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. ఇవి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు వచ్చి గొడవ చేస్తే భయపడబోనని, అంతు తేలుస్తానంటూ హెచ్చరించారు. దీంతో ప్లకార్డులు ప్రదర్శించిన వారిని టీడీపీ కార్యకర్తలు, పోలీసులు బలవంతంగా బయటకు ఈడ్చుకెళ్లారు. పోలీసు స్టేషన్‌కు తరలించారు. సీఎం సభలో ప్రదర్శించిన ప్లకార్డుల్లో తప్పేముందని ముస్లిం సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment