సాక్షి, హైదరాబాద్: ‘‘టీఆర్‌ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారు... మేం మాత్రం ప్రభుత్వంలో చేరబోం’’అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి.. ప్రజాకూటమి కాదు, అది ఈస్టిండియా కంపెనీ– 2018’అని విమర్శించారు. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు భవిష్యత్ తెలంగాణ రాజకీయాలను ఎలా నియంత్రించగలరని ప్రశ్నించారు. ఎన్నికల్లో కూటమికి ఓటమి ఖాయమని, తెలంగాణ ప్రజలు చంద్రబాబును నమ్మబోరని స్పష్టం చేశారు.
రాహుల్ సెక్యులరిజం మోసపూరితం
ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ చెప్పే సెక్యులరిజం మోసపూరితమైనదని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ షరియత్‌లో జోక్యం కల్పించుకునే ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు చర్చలో పాల్గొనవద్దని రాహుల్‌గాంధీ ఎంపీలకు సూచించారని ఆరోపించారు. రాహుల్ తీరుతోనే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందన్నారు. ‘కాంగ్రెస్‌తో కలసి ఉన్నంత వరకు మజ్లిస్ మంచిదైంది.. ఆ తర్వాత చెడ్డదైందా’అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేసే కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తమ్ముడు బీజేపీలో ఉన్నారని దుయ్యబట్టారు. ఇన్నేళ్లు పాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. దేశంలో, తెలంగాణలో ప్రాంతీయ పార్టీల అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సర్వేలు గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. ఎప్పుడూ పేరు వినని సంస్థలు కూడా సర్వేలు విడుదల చేస్తున్నాయని, వీటిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని అన్నారు.
మజ్లిస్ చొరవతోనే
తెలంగాణలో మజ్లిస్ పార్టీ చొరవతోనే ముస్లింలకు విద్య, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అసద్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ముస్లింల గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 50 వేల మంది ముస్లిం విద్యార్థుల కోసం మైనారిటీ గురుకుల పాఠశాలలను నెలకొల్పిందని, ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. 900 మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లగలిగారని అన్నారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, ఒక్క హింసాత్మక ఘటన కూడా జరగలేదని ఆయన గుర్తు చేశారు.
పాతికేళ్లుగా గార్డు లేకుండా: పాతికేళ్లుగా తాను సెక్యూరిటీగార్డు లేకుండా తిరుగుతున్నానని అసద్ చెప్పారు. ‘బీజేపీ నాయకుడు రాజాసింగ్ తలలు నరుకుతామంటూ సవాల్ విసురుతున్నారు. నేను సిద్ధంగా ఉన్నా.. రా చంపేయ్’అని ప్రతి సవాల్ విసిరారు. కొట్టేస్తా. చంపేస్తానంటున్న అభ్యర్థికి మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం చేశారని, ఇదేనా ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’అని ఒవైసీ ప్రశ్నించారు. మజ్లిస్‌ను వంశవార్ పార్టీగా అభివర్ణిస్తున్న మోదీకి.. తన పార్టీలో ఎన్నో కుటుంబాలు వారసత్వంగా కొనసాగడం కనిపించడంలేదా.. అని దుయ్యబట్టారు. తమ గ్రాఫ్ పెంచుకునేందుకు ప్రత్యర్థులు తనపై విమర్శలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు.
మళ్లీ కేసీఆరే సీఎం .. ప్రభుత్వంలో చేరబోం!
Published Thu, Dec 6 2018 3:02 AM | Last Updated on Thu, Dec 6 2018 2:14 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment