శనివారం విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం అప్పారాయుడిపాలెం శివారులో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెంట అడుగులో అడుగు వేస్తున్న అశేష జనవాహిని
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విపక్ష నేత ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో అచెంచల ఆత్మవిశ్వాసం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులొస్తాయనే నమ్మకాన్ని తీసుకొస్తోంది. దీంతో ఊరూవాడా ఆయన కోసం తరలివస్తున్నారు. ప్రస్తుత పాలనపై విసుగెత్తిన వాళ్లు, మార్పును కోరుకునే వాళ్లు, రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేనివాళ్లు, చంద్రబాబు పాలనలో అనుభవాలు చవిచూసిన మాజీ ఉన్నతోద్యోగులు, అనుక్షణం చిత్ర వధ అనుభవిస్తున్న ఉద్యోగులు, భద్రత కరువైన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా తరలివస్తున్నారు. ‘నువ్వొస్తేనే రాష్ట్రం బాగుంటుంది’ అని మనోభావాలను వ్యక్తీకరిస్తున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో శనివారం సాగిన 245వ రోజు పాదయాత్రలో కూడా ఇలాంటి సన్నివేశాలు అనేకం కనిపించాయి. కొత్తపాలెం క్రాస్ నుంచి నారాయణపురం, మామిడివాడ, పంచదార్ల, అప్పరాయుడుపాలెం, ధారభోగాపురం వరకు వేలాది మంది జననేతకు స్వాగతం పలికారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మార్చే సారథి ఆయనేనంటూ అభిప్రాయపడ్డారు. కన్నీళ్లు తెప్పిస్తూ.. జీవితాలతో ఆడుకుంటున్న అధికార తెలుగుదేశం పార్టీని జననేత చెబుతున్నట్లు బంగాళాఖాతంలో కలపాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రే దళారై దోచుకుంటున్న వైనాన్ని ఊరూరా జనం చెప్పుకొచ్చారు.
మండుతున్న రైతు గుండెకు చల్లదనం
మూతపడ్డ సహకార చెక్కర ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తామని, నష్టపోయిన కర్మాగారాలకు జవసత్వాలిస్తామని జగన్ చేసిన ప్రకటన యలమంచిలి చెరకు రైతులను ప్రభావితం చేసింది. రాంబిల్లి మండలం కొత్తూరు రైతులు జననేతను కలిసి సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ మంచి రోజులు వస్తాయన్న విశ్వాసం పెరిగిందన్నారు. ఏటికొప్పాక చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు ఇవ్వక బాధపడుతున్న నానేపల్లి గణేష్.. అభిమాన నేత ముందు ఆనందాన్ని పంచుకున్నాడు. రాజశేఖరరెడ్డి గారి పాలనలో ఎంతో ధీమాగా ఉన్నామని చెప్పాడు. మీ వల్లే గత వైభవం వస్తుందన్న విశ్వాసం ప్రదర్శించాడు. నేవెల్ బేస్ భూసేకరణ బాధితులూ వచ్చారు. కేంద్రంతో పని లేకుండానే న్యాయం చేస్తానంటూ మీరిచ్చిన హామీ మత్స్యకారుల జీవితాల్లో ఆశలు రేపిందన్నారు. ‘ఎన్నాళ్ల నుంచో ఆందోళన చేస్తున్నామయ్యా.. మీరొక్కరే కనికరించారు.. మీరే సీఎం అవుతారు.. మా బతుకుల్లో చీకట్లు తొలుగుతాయి’ అని వీరభద్రం, శంకర్ అన్నారు. శారద, వరాహ నదుల్లోనే చేపల వేటకు అనుమతిస్తే మేమెలా బతకాలంటూ మత్స్యకారులు జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మా ఉపాధి గురించి మీరే ఆలోచించాలన్నా.. అంటూ కొత్తపట్నం, వాడనరసాపురం, ఈతపాలెం, ఏలుగుండుపాలెం, వారకాడ, బంగారయ్యపాలెం గ్రామాల ప్రజలు జగన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఏజెన్సీలో వంద బడులు తీసేస్తారా?
ఇదెక్కడి ప్రభుత్వం? గిరిజనులపై ఇంత కక్షా? అంటూ గిరిజన ప్రాంత ఉపాధ్యాయ ప్రతినిధి కోడా సింహాద్రి ఆవేదన వెలిబుచ్చాడు. సహచరులతో పాటు ఆయన జగన్‌ను కలిశాడు. విశాఖ ఏజెన్సీలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పాడు. ఏజెన్సీలోని 11 మండలాల్లో వంద పాఠశాలలను మూయించారని, విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్నారని వివరించాడు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి తగ్గట్టు అధ్యాపక నియామకాలు జరగడం లేదన్నాడు. మీరు సీఎం అయితే ఈ పరిస్థితులు మారతాయని ఆకాంక్షించాడు. 15 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా జగన్ వద్ద కష్టాలు చెప్పుకున్నారు. ‘మా నోళ్లు కొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందన్నా.. మీరు అధికారంలోకి రాగానే మంచి రోజులొస్తాయనే నమ్మకం ఏర్పడింది’ అని గట్టు రాఘవ, ధనలక్ష్మి తెలిపారు. ఆరోగ్యశ్రీ అందని కిడ్నీ బాధితులు, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులు రాని వారు, రుణమాఫీ హామీతో మోసపోయిన వారు.. అడుగడుగునా కష్టాలు చెప్పుకున్నారు. జగనన్న రాగానే కష్టాల నుంచి గట్టెక్కుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
హమ్మయ్యా.. వర్షం వెలిసింది..
మధ్యాహ్న భోజన విరామం తర్వాత పాదయాత్ర తిరిగి మొదలయ్యే సమయంలో వర్షం ప్రారంభమైంది. ‘జగన్‌ను కలుద్దామని వచ్చాను.. మళ్లీ వాన పడుతోంది. కలుస్తామో.. లేదో..’ అంటూ నర్సమ్మ, శంకర్, వీరయ్యతో పాలు అనేక మంది పాదయాత్ర శిబిరం వద్ద ఆందోళనగా అన్నారు. అప్పటికే జనం.. పాదయాత్ర శిబిరం సమీపంలోని చెట్ల కింద, రోడ్డుపై గొడుగులు పట్టుకుని నిరీక్షిస్తుండటం కనిపించింది. కొద్దిసేపటి తర్వాత వర్షం ఆగిపోవడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ‘హమ్మయ్యా.. వర్షం ఆగింది.. పాదయాత్ర సాగుతుంది’ అంటూ ఉత్సాహం ప్రదర్శించారు. తమ నేత బయటకు రాగానే వాళ్లంతా చుట్టుముటారు. ఆయనతో కలిసి చినుకులతో తడిసిన రోడ్డుపై కేరింతలు కొడుతూ ముందుకు సాగారు. మధ్యలో కాసేపు జల్లులు పడినా ఎవరూ లెక్క చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment