'అవధ్‌' ఎవరిది..? | Avadh Constituency Review on Lok Sabha Election | Sakshi
Sakshi News home page

'అవధ్‌' ఎవరిది..?

Published Tue, Apr 9 2019 8:47 AM | Last Updated on Tue, Apr 9 2019 12:11 PM

Avadh Constituency Review on Lok Sabha Election - Sakshi

ఇందిరాగాంధీ, వీపీ సింగ్, అటల్‌ బిహారీ వాజ్‌పేయి.. ముచ్చటగా ముగ్గురు ప్రధానులూ అక్కడి నుంచే.. అత్యధిక లోక్‌సభ సభ్యులను అందించడం ఒక్కటే యూపీ ప్రత్యేకత కాదు. భారత రాజకీయాలను శాసించబోయే రాష్ట్రం సైతం ఇదే. అంతేకాదు.. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదలుకొని దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానమంత్రులు కూడా ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అత్యధిక కాలం 17 ఏళ్లపాటు దేశానికి నాయకత్వం వహించిన ఇందిరాగాంధీకి పట్టం కట్టింది కూడా ఈ రాష్ట్ర ప్రజలే. భారత రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయాన్ని అందించిన వీపీసింగ్‌ ఈ రాష్ట్రం నుంచే గెలిచారు. బీజేపీ పితామహుడూ, ఆ పార్టీ తొలి ప్రధానీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి కూడా ఇదే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించటం విశేషం. అంతేకాదు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచి తీరాల్సిందే. రానున్న ప్రతి దశ ఎన్నికల్లోనూ యూపీ ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖంగా వార్తల్లో నిలవనుంది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ కుల, సామాజిక, రాజకీయ పరిస్థితులు అక్కడి ఫలితాలపై ప్రభావాన్ని చూపే అవకాశం మెండుగా ఉందని విశ్లేషకుల అంచనా.

ముచ్చటగా ముగ్గురు ప్రధానులు
రాజకీయంగా అవధ్‌ ప్రాంతానిది ఒక ప్రత్యేక స్థానం. ఈ ప్రాంతం నుంచే ముచ్చటగా ముగ్గురు ప్రధానులు దేశానికి నాయకత్వం వహించారు. 1967 నుంచి 1977 వరకూ రాయబరేలీ నుంచి దశాబ్దకాలం పాటు ఇందిరాగాంధీ, ఫతేపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వీపీసింగ్, లక్నో నుంచి అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రులుగా ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించడం విశేషం. అవధ్‌ ప్రాంతంలో 27 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఈ సంఖ్య గుజరాత్, రాజస్తాన్‌లలోని లోక్‌సభ స్థానాల కన్నా ఎక్కువే. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని, బహుజన్‌ సమాజ్‌పార్టీ అధినేత మాయావతి చేసిన ప్రయత్నం ఫలించి ఉంటే, ఈపాటికి అవధ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి ఉండేది.

‘కమలం’ చరిత్ర
ఈ ప్రాంతంలో 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 24 స్థానాలూ, తన భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్‌ ఒక్క స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 2014లో విస్తృతంగా వీచిన మోదీ గాలులన్నీ మొత్తం ఉత్తరప్రదేశ్‌ని ఆ పార్టీకి కంచుకోటగా మార్చాయి. అయితే ఈ మోదీ సుడిగాలులకు తట్టుకొని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాయబరేలీ, అమేథీల్లో తమ ప్రాభవం తగ్గకుండా కాపాడుకోగలగడం విశేషం. ఈ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీకి దక్కిన ఒకే ఒక్క స్థానం కనౌజ్‌ లోక్‌సభ స్థానం. ఈ ప్రాంతంలో జరిగిన గత ఎన్నికల్లో బీజేపీకి 41.5 శాతం ఓట్లు, సమాజ్‌వాదీ పార్టీకి 22.2 శాతం, బహుజన్‌ సమాజ్‌పార్టీకి 19.32 శాతం, కాంగ్రెస్‌ పార్టీకి 12.8 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 1990ల్లో సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభమైనప్పటి నుంచి, ఈ ప్రాంతంలో గత చరిత్రలో లేని విధంగా బీజేపీ అత్యధిక స్థానాలను స్వీప్‌ చేయడం గమనార్హం. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ప్రాంతంలో ప్రతిసారీ ఏదో ఒక పార్టీ ఆధిపత్యం సాగిస్తుండగా, బీజేపీ 2014లో స్పష్టమైన ఆధిక్యతను కనబర్చింది.

కాంగ్రెస్‌–బీజేపీ పోటా పోటీ
2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అవధ్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ 14 స్థానాల్లో విజయఢంకా మోగించగా, ఎస్పీ, బీఎస్పీ, చెరో ఆరు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే బీజేపీ సంప్రదాయక ఓటుబ్యాంకు ఉన్న ఒకే ఒక్క లక్నో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. 1999 నుంచి 2014 వరకు ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బీజేపీ ఆసక్తికరంగా 16వ లోక్‌సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించింది. 2014లో విజయవిహారం చేసిన బీజేపీ, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో 403 స్థానాలకు గాను 325 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి ఒంటరిగా 312 స్థానాలు రాగా మిగిలిన స్థానాల్లో భాగస్వామ్య పక్షాలు గెలిచాయి. అవధ్‌ ప్రాంతంలో 137 శాసనసభ స్థానాలుండగా బీజేపీ 116 స్థానాల్లో విజయఢంకా మోగించింది. మిగిలిన 21 స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ 11 స్థానాలూ, కాంగ్రెస్‌ 4 స్థానాలూ, బీజేపీ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్‌ 4 స్థానాలూ, ఇతరులు 2 స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశారు. అవధ్‌ ప్రాంతంలో 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల మాదిరిగానే, బీఎస్పీ ఈ ప్రాంతంలో ఏ ఒక్క శాసనసభా స్థానాన్నీ గెలవలేకపోయింది.

చతికిలబడిన కాంగ్రెస్‌
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, 2012 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ జయ కేతనం ఎగురవేయగా, 2017 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ సంపూర్ణ ఆధిక్యాన్ని కనబర్చింది.  2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో సమాజ్‌వాదీ పార్టీ 95 సీట్లు కైవసం చేసుకుంటే, బీజేపీ 12 స్థానాలతో మూడో స్థానంలో నిలిచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 14 స్థానాలలో చెప్పుకోదగ్గ విజయాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ, తదనంతర ఎన్నికల్లో చతికిలబడింది. రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న అమేథీ లోక్‌సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెలుచుకోలేక చతికిలబడింది. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న రాయబరేలీ లోక్‌సభ పరిధిలో 2 అసెంబ్లీ స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది.

దళిత ఓట్లే ప్రధానం
అవధ్‌ ప్రాంత జనాభాలో నాలుగో వంతు దళితులున్నారు. ఎన్నికల్లో వివి«ధ పార్టీల జయాపజయాలను వీరు నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. అలాగే అవధ్‌ ప్రాంతంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 15–20 శాతం ముస్లిం జనాభా ఉంది. బీఎస్పీ ఓటు బ్యాంకుగా దళితులు ఉండగా, ముస్లింలు ఎక్కువగా సమాజ్‌వాదీ పార్టీ వైపు ఉన్నారు. ఈ రెండు పార్టీలూ దళితుల, ముస్లింల ఓట్లను సమన్వయం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అలాగే ఈ కూటమికి బయట ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆయా వర్గాల్లో తమకున్న పట్టును బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాక ఈ ప్రాంతంలో నాలుగో వంతు ప్రజానీకం అగ్రకులాలకు చెందినవారే. ఈ ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ, కాంగ్రెస్‌ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ ప్రాంతంలోని యాదవ సామాజిక వర్గం సమాజ్‌వాదీ పార్టీకి సంప్రదాయక ఓటుబ్యాంకుగా ఉన్నారు. కుర్మీలు అప్నాదళ్‌ పార్టీ వెనుక సమీకృతమై.. బీజేపీ–అప్నాదళ్‌ విజయానికి కృషి చేయనున్నారు. అవధ్‌ ప్రాంతంలో గ్రామీణ, పట్టణాల నియోజకవర్గాలుగా విభజించి చూస్తే, కేవలం నాలుగు స్థానాలు మాత్రమే పట్టణ నియోజకవర్గాలుగా ఉన్నాయి. మిగిలిన 23 గ్రామీణ నియోజకవర్గ ఓటర్లే పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

మారిన ఓట్ల సమీకరణలు
2014 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ విడివిడిగా పోటీ చేశాయి. ఇరు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే ఆ ఎన్నికల్లో అవధ్‌ ప్రాంతంలో 25 స్థానాలకు (అమేథీ, రాయబరేలీ మినహాయించి) గాను 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీలను ఓటర్లు కొంచెం ఆదరించినా వారి సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి ఉండేది. గత మేలో జరిగిన ఫూల్‌పూర్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీచేయడంతో బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించగలిగారు. ఫూల్‌పూర్‌ స్థానంలో బీజేపీకి చెందిన కేశవప్రసాద్‌ మౌర్య 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2017లో యూపీ ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ఈ స్థానానికి రాజీనామా చేశారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో కేశవప్రసాద్‌ మౌర్య ఫూల్‌పూర్‌ స్థానం నుంచి 52.4 శాతం ఓట్లతో సునాయాస విజయాన్ని నమోదు చేశారు. ఇక్కడ సమాజ్‌ వాదీ పార్టీ రెండో స్థానంలో నిలిచి, 20.3 శాతం ఓట్లను సాధించింది. బీఎస్పీ, ఎస్పీ ఓట్ల శాతాని కంటే 14.8 శాతం అధిక ఓట్లతో మౌర్య విజయం సాధించారు. గతేడాది ఇదే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ బీఎస్పీ మద్దతుతో పోటీచేసి 47.12 శాతం ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికలో బీజేపీకి 38.95 శాతం ఓట్లు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికతో పోలిస్తే, ఈ ఉప ఎన్నికలో బీజేపీ 13.45 శాతం ఓట్లను కోల్పోయింది. ఎస్పీ, బీఎస్పీ కూటమికి పది శాతం పైగా ఓట్లు పెరిగాయి. బీజేపీ కోల్పోయిన మిగిలిన ఓట్లు ఇతర అభ్యర్థులకు పోలయ్యాయి. కనుక  2014లో ఇరువురికీ విడివిడిగా వచ్చిన ఓట్లను కలిపి చూస్తే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలకూ కలిపి అవధ్‌ ప్రాంతంలో 13కి మించి స్థానాలు లభించవచ్చని విశ్లేషకుల అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement