సాక్షి, విజయవాడ : రాజధాని రైతులు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకనకదుర్గ అమ్మవారిని శుక్రవారం మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చారు. భూముల ఇచ్చిన రైతులకు ముఖ్యమంత్రి అండగా ఉంటారని తెలిపారు. మూడు ప్రాంతాలు అభివృద్ధికి సీఎం కట్టుబడి ఉన్నారని, దీనిలో భాగంగానే రాజధానులు వికేంద్రీకరణ చేపడుతున్నారన్నారు. చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతం వల్ల తెలంగాణలో నష్టపోయినా ఇంకా మేల్కొలేదని దుయ్యబట్టారు. రాజధాని పేరుతో చంద్రబాబు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని ఏర్పాటు విషయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలతో చంద్రబాబు కనీసం చర్చించలేదని, తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ ప్రజల నాడి తెలుసుకున్న మనిషి అని.. చంద్రబాబులాగా రాత్రి ఒక మాట పగలు ఒక మాట మాట్లాడటం ముఖ్యమంత్రికి చేతకాదని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలకు లోటు లేకుండా ఒక తండ్రి లాగా సమన్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మేడ్ ఇన్ పబ్లిక్ అని ప్రశంసించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి సీఎం జగన్ అని ప్రస్తావించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణా విషయంలో రెండుకళ్ల సిద్ధాంతం అవలంభించిన చంద్రబాబు.. ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకించడం హాస్యాస్పదమన్నారు. రాజధాని అని చెప్పి 5 సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి చేశారని.. తాత్కాలిక భవనాలు తప్ప ఏమీ లేదని మండిపడ్డారు.ఎజెండా లేని టీడీపీకి తెలంగాణాలో పట్టిన గతే ఆంధ్రాలో కూడా పట్టబోతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment