పవన్‌ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: అవంతి | Avanthi Srinivas Fires On pawan Kalyan In Visakhapatnam | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి: అవంతి

Published Tue, Oct 29 2019 2:23 PM | Last Updated on Tue, Oct 29 2019 3:53 PM

Avanthi Srinivas Fires On pawan Kalyan In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలే ప్రధాన కారణమని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా.. ఏర్పాటు చేయాలన్నా మహిళా శక్తే కీలకమని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ మంత్రి మాట్లాడుతూ.. ఏపీ సమస్యలపై పార్లమెంటులో ఎంపీ విజయసాయిరెడ్డి ఒకే ఒక్కరుగా పోరాటం సాగించారని ప్రస్తావించారు. వైఎస్సార్‌ సీపీ విజయంలో ఆయన కీలకపాత్ర పోషించారని అన్నారు. విజయసాయిరెడ్డి నేతృత్వంలో విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. నాడు ఎన్టీఆర్‌ తర్వాత ఢిల్లీలో కేంద్రాన్ని ఎదురించిన తెలుగు వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. 

టీడీపీకి అద్దె మైక్‌లా మాట్లాడకండి
గత అయిదేళ్లలో జరిగిన భూదోపిడీ ఎక్కడా జరగలేదని మంత్రి అవంతి ఆరోపించారు. ‘ఇప్పుడు టీడీపీ నేతలు ఇసుక గురించి మాట్లాడుతున్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇసుకను ఎలా దోచుకున్నారో నా దగ్గర లెక్కలు ఉన్నాయి... దమ్ముంటే చర్చిద్దాం రండి’ అంటూ సవాల్‌ విసిరారు. ‘పవన్‌ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీ పార్టీని టీడీపీలో కలిపేయాలనుకుంటే కలిపేయండి.. కానీ టీడీపీకి అద్దె మైక్‌లా మాట్లాడకండి’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను విమర్శించారు. టీడీపీ నేతల అవినితి మీకు ఎందుకు కనిపించడం లేదా అని మంత్రి పవన్‌ను ప్రశ్నించారు. 

మహిళల జీవితాల్లో కొత్త వెలుగు
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే 80 శాతం సీఎం జగన్‌ నెరవేర్చారని, అయిదేళ్ల పరిపాలనలో చేయాల్సిన హామీలను అయిదు నెలల్లో చేసి చూపించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిదేనని ప్రశంసించారు. చంద్రబాబుకు అయిదేళ్లు అవకాశమిచ్చినా ఎన్ని హామీలు నేరవేర్చారో చెప్పమనండంటూ నిలదీశారు. సంపూర్ణ మద్యపాన నిషేదం ద్వారా మహిళల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకు వచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్న సీఎం జగన్‌ గొప్పవారా లేదా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన చంద్రబాబు గొప్పవారా అని సూటిగా ప్రశ్నించారు. మహిళలు రోజుకు అరగంటైనా వార్తా ఛానళ్లు చూడాలని సూచించారు. అన్ని ఛానెల్స్‌ చూడాలని, అప్పుడే నిజాలు తెలుస్తాయని అన్నారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్‌ ద్వారా నిజాలు బయటకు వస్తాయని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement