విశాఖ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేశారని పర్యాటక శాఖామంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీని పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజా సేవ చేయడమంటే దేవుడు సేవగా భావించాలని అవంతి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి భావిస్తున్నారని, విశాఖకు మహర్దశ పట్టబోతుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తోందన్నారు. అందుకే వైఎస్సార్ తనయుడిగా మళ్లీ ఆరోగ్యశ్రీని ప్రారంభించారన్నారు.
విశాఖ నగరం 12 డివిజిన్ ఎన్జీవో కాలనీలోని జీవిఎంసీ ప్రైమరీ పాఠశాలలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఎంపి ఎంవీవీ సత్యనారాయణ, కలెక్టర్ వినయ్ చంద్, ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి కెకె రాజులతో కలిసి ప్రారంభించిన అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 5 ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పుట్టిన ప్రతీబిడ్డకు పోలియో చుక్కలు వేయించి వారికి అంగవైకల్యం రాకుండా నివారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు. వైఎస్సార్ కంటివెలుగు ద్వారా జిల్లాలో 13 వేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు పంపిణీ చేశామన‍్నారు. కేజీహెచ్‌ను సూపర్ స్పెషాలిటీ గా అభివృద్ధి చేస్తామని...త్వరలోనే పాడేరులో వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment