విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు
కడప కార్పొరేషన్: నేను నిప్పులాంటి మనిషినని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధపడి, నిజంగా నిప్పేనని నిరూపించుకోవాలని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు సవాల్ విసిరారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మైదుకూరు, కమలాపురం ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, పి. రవీంద్రనాథ్‌రెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, పవన్‌కళ్యాణ్ కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లు కలిసి సంసారం చేసిన తర్వాత నేడు ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం విచిత్రంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా నేటికీ సజీవంగా ఉండటానికి కారణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషేనని తెలిపారు. ఆయన చేపట్టిన ధర్నాలు, దీక్షలు, యువభేరిల వల్ల ప్రజలు చైతన్యవంతులయ్యారని, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు.
నేను అడిగినా కేంద్రం ఇవ్వలేదని, బీజేపీతో జగన్ లాలూచీ పడ్డారని సీఎం విమర్శించడం హాస్యాస్పదమన్నారు. టీడీపీపై బీజేపీ విమర్శలు చేసినా, పవన్‌కళ్యాణ్ విమర్శలు చేసినా జగనే చేయించారని చెప్పడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో లక్షా నలభై ఐదువేల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. వైజాగ్‌లో రూ.245కోట్ల విలువగల భూమిని ఏపీఐఐసీ ద్వారా కాకుండా నేరుగా సీఎం బంధువులు కాజేశారని ఆరోపించారు. రాష్ట్రంలో నలభై లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు కట్టిన సొమ్ము వెనక్కిరాక రోడ్డున పడి ఉంటే, ఆ సంస్థ ఆస్తులను కూడా టీడీపీ నాయకులు దోచుకున్నారన్నారు. నీరు–చెట్టు పనుల్లో రూ.1800 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచి నాలుగు వేల కోట్లు స్వాహా చేశారన్నారు. అమరావతిలో ఐదు పంటలు పండే 35వేల ఎకరాల భూములను లాక్కొని ఐదువేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మురళీమోహన్, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు వంటివారు ముందే భూములను కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నారని, ఆ భూములు ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయన్నారు. పట్టిసీమలో రూ.750కోట్ల అవినీతి జరిగిందని కాగ్ కడిగేసిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల్లో 80 శాతం నిధుల్ని వినియోగించలేదని, ఖర్చుపెట్టిన 20 శాతం నిధులకు కూడా యూసీలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.
హోదా కోసం రాజీనామా చేసేందుకు సిద్ధం: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
ప్రత్యేక హోదా కోసం ఎంపీలతోపాటు ఎమ్మెల్యేలందరం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాకు వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తెలియక ఒకసారి మోసపోయారని, మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. బాబు డబ్బుకోసమే ముఖ్యమంత్రి అయ్యారే తప్పా ప్రజలకు సేవ చేయాలని కాదన్నారు. రాష్ట్ర బడ్జెట్ లక్షా తొంబైవేల కోట్లు చంద్రబాబు జేబులోకే పోతున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 సీట్లలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. హోదా సాధించేవరకూ వైఎస్‌ఆర్‌సీపీ వెనకడుగు వేయదని తేల్చిచెప్పారు.
చంద్రబాబు ప్లేటు ఫిరాయించినంత మాత్రాన ప్రజలు నమ్మరు: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ప్రత్యేక హోదా ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు ఇన్నాళ్లు తుంగలో తొక్కారనే విషయం ప్రజలకు బాగా తెలుసని, చంద్రబాబు నేడు ప్లేటు ఫిరాయించినంత మాత్రాన ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి అన్నారు. చంద్రబాబు చుట్టూ ఉండే నారాయణ, కోడెల తనయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మురళీమోహన్ వంటి వారు అమరావతిలోని భూములను కారు చౌకగా కొట్టేశారని, అసైన్డ్ భూములను కూడా వదల్లేదన్నారు. లక్షా యాభై వేల ఎకరాల ఆయకట్టు ఉన్న బ్రహ్మంసాగర్‌లో ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి పని కూడా చేయలేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి కూలీలకు పని కల్పించకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో పనులు చేశారని ధ్వజమెత్తారు. 20 శాతం కూడా పనిచేయకుండా వందశాతం బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని, బ్రహ్మదేవుడొచ్చినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు తుమ్మలకుంట శివశంకర్, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు.
మంత్రి ఆది కలెక్షన్ వీరుడు
మంత్రి ఆదినారాయణ రెడ్డి కలెక్షన్ పదవి చేపట్టినప్పటి నుంచి కలెక్షన్ వీరుడిగా మారారని ఎద్దేవా చేశారు. పార్టీ మారేముందు 100 రోజుల్లో జమ్మలమడుగును అభివృద్ధి చేస్తానన్న ఆయన ఇన్ని మాసాల్లో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. గాలేరు నగరి ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారా, గండికోట ముంపు వాసుల సమస్య తీర్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. మంత్రి అయ్యాక ఆయన చేసిన ఘన కార్యమేమిటంటే రూ.5కోట్లు తీసుకొని సస్పెండ్ అయిన 142 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడమేనన్నారు. ఆదికి చిత్తశుద్ధి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment