మచిలీపట్నం: పోలవరం ప్రాజెక్టుకు దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది వైఎస్ కలగా చెప్పారు. రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బహుళార్థక సాధక ప్రాజెక్టుగా దీనిని చేపట్టారని గుర్తు చేశారు. వైఎస్‌పై ఉన్న నమ్మకంతోనే రైతులు స్వచ్ఛందంగా తమ భూములిచ్చారని గుర్తుచేశారు.
పోలవరం కాలువల నిర్మాణం కోసం అప్పట్లోనే రూ.ఆరు వేల కోట్లను ఖర్చు చేశారని, కృష్ణా డెల్టా ప్రజలు వైఎస్ సంకల్పానికి పరవశించి ఎంతో నమ్మకంతో భూములిచ్చినట్లు తెలిపారు. పోలవరం నిర్మాణ రథసారథిగా ప్రజానీకం వైఎస్‌ను గుర్తుంచుకుంటోందని.. అందుకనే ఆ ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు చేసిందేంలేదన్నారు.
అడుగడుగునా చంద్రబాబు మోసం
ప్రతి సోమవారం ప్రాజెక్టు సందర్శన అంటూ చంద్రబాబు కేంద్రం ఇచ్చే నిధులను దుబారా చేశారే తప్ప, దానిని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ఆయనకు లేదన్నారు. గేట్లు వేయడాన్నే ప్రాజెక్టు పూర్తి చేసినట్టుగా మోసపూరిత ప్రసంగాలు చేసి రైతులను వంచించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినా.. ప్రధానికి వంగి వంగి దండాలు పెట్టి.. దాన్ని లాక్కుని తానే కడుతున్నట్టుగా హంగామా చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు.
చంద్రబాబు చిత్తశుద్ధిపై ప్రజలకు నమ్మకం లేకనే చిత్తుగా ఓడించారని తెలిపారు. మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి.. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్న వైఎస్ జగన్ వాటికి తనదైన శైలిలో పరిష్కారం చూపుతారనే నమ్మకం అందరిలోనూ ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు దేవుడు వైఎస్‌ను పుట్టించారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆయన తనయుడైన వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా పంపారని చెప్పారు. సీఎంగా వైఎస్ జగన్.. తిరిగి రాజన్న పాలనాకాలం నాటి స్వర్ణయుగాన్ని తీసుకొస్తారని బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి
Published Tue, May 28 2019 4:11 AM | Last Updated on Tue, May 28 2019 4:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment