సాక్షి, ఖమ్మం : టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఉద్ఘాటించారు. 2023లో తెలంగాణలో బీజేపీ విజయం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలు మొదలయ్యాయని తెలిపారు. ఖమ్మం సిటీలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో బీజేపీ బలపడుతోందని, సభ్యత్వ నమోదుకు వస్తున్న స్పందనే దీనికి నిదర్శమన్నారు. పాలనలో టీఆర్‌ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను 35 నుంచి 23 కి తగ్గించే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతోనే వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త అసెంబ్లీ, సెక్రటరియేట్ నిర్మాణాలకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల ప్రభావం రోజురోజుకీ తగ్గుతోందని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు అనైతికమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment