
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ను బలోపేతం చేసే ప్రయత్నం అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఉపయోగపడిందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లోని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలుచుకొని మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్, చంద్ర బాబు కూటములు దేశ రాజకీయాల్లో పనిచేయవని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో జరిగే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలలో ఈ కేటగిరి(BC-E) ఏర్పాటు చేసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు వల్ల అనేక మంది ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారని, పంచాయతీ ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బ తిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.