సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలు సత్యదూరమని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నీతి, నిజాయితీలతో కొనసాగుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి మోదీ ముందుకు సాగుతున్నారన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేంద్రంపై అహంకార పూరిత దోరణిలో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటాయని గ్రహించే మోదీ ప్రభుత్వంపై నింద వేయడం ద్వారా ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి పైసా ఇవ్వలేదనడం సరికాదని, రెండు లక్షల కోట్లను అనేక గ్రాంట్ల రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు. 11 సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్ సరఫరాకు ఇతర, దక్షిణ పవర్గ్రిడ్లను అనుసంధానం చేయడానికి, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు రూ. 50 వేల కోట్లను కేటాయించిందని స్పష్టం చేశారు. ఎన్టీపీసీ 4వేల మెగావాట్లు, మహబూబ్‌నగర్ లో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్.. కేంద్ర ప్రభుత్వ పుణ్యమేనన్నారు. రాష్ట్రంలో 2400 కిలోమీటర్లు జాతీయ రహదారులను 5600 కిలోమీటర్లకు కేంద్రం పెంచిందని, దీని కోసం రూ.60వేల కోట్లను ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ఎయిమ్స్ ను ప్రకటించామని, రామగుండంలో ఎరువుల పరిశ్రమను తిరిగి తెరిపిస్తున్నామన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్స్ పార్క్, కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ లను పూర్తి చేసింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 2.10 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రధాని సడక్ యోజన కింద రూ. 1700కోట్ల నిధులు వెనక్కి పోయె పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయకపోవడం వల్లే కేంద్రం నుంచి రెండు వేల కోట్లు రాకుండా పోయాయన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్దంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులను సాధించింది రాష్ట్ర ప్రభుత్వమేనని, రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టులు.. పథకాల పై ఈ బుక్‌ను ప్రింట్ చేసి గ్రామ గ్రామాన పంపిణీ చేస్తామన్నారు. శబరిమల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. ప్రభుత్వమే బలవంతంగా ఇద్దరు మహిళలను ఆలయంలోకి పంపిందని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికే శబరిమలలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment