
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకు జనరల్ సెగ్మెంట్‌గా ఉన్న బాపట్ల 2009 పునర్విభజన నేపథ్యంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారిపోయింది. ఇక్కడ నుంచి గెలిచిన వారిలో నలుగురు ఎంపీలు కేంద్రమంత్రులుగా పనిచేయగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
నియోజకవర్గాలు : గుంటూరు జిల్లాలోని వేమూరు, రేపల్లె, బాపట్ల,ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
సీఎంను అందించిన బాపట్ల
బాపట్ల పార్లమెంట్ నుంచి ఎంపీలుగా గెలుపొందిన పి.అంకినీడు ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి వంటి వారు కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఇక్కడ నుంచి 1998లో ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2009లో పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బాపట్ల నుంచి పనబాక లక్ష్మి ఇక్కడ నుంచి పోటీ చేసి 69వేల భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందడమే కాకుండా కేంద్ర మంత్రిగా పనిచేశారు. పి. అంకినీడు ప్రసాద్ మినహా మిగతా తొమ్మిది మంది కొత్తవారికి ఇక్కడి ప్రజలు అవకాశం కల్పిస్తూ వచ్చారు. 11 సార్లు ఎన్నికలు జరగ్గా ఆరు సార్లు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులు, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
సామాన్యునికే పట్టం కట్టనున్న ప్రజలు
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీలో నిలిచిన నందిగం సురేష్ మాత్రం పార్టీలో సామాన్య కార్యకర్త. ఆర్థిక బలం, అంగబలం పెద్దగా లేని సురేష్‌కు వైఎస్.జగన్ టిక్కెట్టు కేటాయించడంతోపాటు, ఎంపీ అభ్యర్థుల జాబితాను సురేష్‌తో చదివించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సురేష్‌ను గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో భారీ స్థాయిలో చేసిన అభివృద్ధి పనుల కారణంగా ప్రజలు వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపనున్నారు.
మాల్యాద్రికి గడ్డుకాలమే..
2009లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన శ్రీరామ్ మాల్యాద్రిని 2014లో బాపట్ల పార్లమెంట్ ప్రజలు గెలిపించారు. అయితే ఐదేళ్లలో ప్రజల సమస్యలు తీర్చడం మాట అటుంచితే కనీసం ముఖం కూడా చూపించని పరిస్థితి. కొన్ని గ్రామాల్లోని ప్రజలకు వాళ్ల ఎంపీ ఎవరో తెలియదంటే మాల్యాద్రి ప్రజలకు ఏ స్థాయిలో అందుబాటులో ఉన్నారో అర్థమవుతోంది. దీనికి తోడు గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో టీడీపీలో అంతర్గత విభేదాలతో నాయకులు పార్టీని వీడుతుండటం, ప్రకాశం జిల్లాలోని చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్‌సీపీలో చేరడం, మాజీ ఎంపీ, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్సార్‌సీపీలో చేరి పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనుండటంతో ఈ సారి మాల్యాద్రి ఓటమి ఖాయంగా కనిపిస్తుంది. అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌కు తొలుత టిక్కెట్టు ఇచ్చారు. అయితే కార్యకర్తల్లో నిరసన వ్యక్తం కావడంతో శ్రీరామ్ మాల్యాద్రికి కేటాయించారు.
– నక్కా మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment