సాక్షి, హైదరాబాద్: ఏపీలో టీడీపీ పేకాట విధానం కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కైకలూరులోని ఎంపీ మాగంటి బాబు కార్యాలయం పేకాట డెన్‌గా మారిందని దుయ్యబట్టారు. ఇక్కడ రోజుకు రూ. 12 కోట్ల వ్యాపారం జరుగుతోందని, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉందని ఆరోపించారు. తమకు ప్రత్యేక రాజ్యాంగం ఉందన్నట్టుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆడిందే ఆట, పాడిందే పాట, చెప్పిందే చట్టం అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వ వైఖరి ఉందన్నారు.
చంద్రబాబు సర్కారు అక్రమార్కులకు అండగా నిలుస్తోందని ఆరోపించారు. విజయవాడ సెక్స్ రాకెట్, ఎంపీ ఇంట్లో పేకాట, దుర్గమ్మ ఆలయ భూముల కబ్జా, రోడ్ల వెడల్పు పేరుతో 40 దేవాలయాలను కూల్చివేయడం, సదావర్తి భూములను కాజేసేందుకు ప్రయత్నం.. వీటన్నింటికి చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలిచిందని ధ్వజమెత్తారు. దౌర్జన్యాలకు దిగిన టీడీపీ నాయకులు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన చంద్రబాబుకు ఎటువంటి శిక్షలు లేవన్నారు. న్యాయం, ధర్మం తమకు వర్తించవన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అతి దుర్మార్గం ప్రవర్తిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని వాపోయారు.
దళితులపై దాడుల, రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఆర్థిక నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసేవిధంగా ప్రతిపక్ష సభ్యులు కొందరిని టీడీపీలో చేర్చుకుని అధికార పదవుల్లో కూర్చోబెట్టారని విమర్శించారు. దేశ చరిత్రలో ఇంత అరాచక పాలన ఎప్పుడు చూడలేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై వాస్తవ పరిస్థితులను గ్రహించి చంద్రబాబు సర్కారు సాగిస్తున్న దోపిడీ విధానాన్ని అరికట్టాలన్నారు. టీడీపీ దుర్మార్గ పాలనను అంతమొందించాలని బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు.
ఆడిందే ఆట, చెప్పిందే చట్టం
Published Tue, Dec 26 2017 1:47 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment