
చండీగఢ్: గత ఏడాది హరియాణాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అట్టహాసంగా ‘అంతర్జాతీయ గీత మహోత్సవా’న్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ఖట్టర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని అతిగా దుబారా చేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పది ‘భగవద్గీత’ గ్రంథాలను కొనుగోలు చేసేందుకు రూ. 3.8 లక్షలు ఖర్చుచేసినట్టు తాజాగా ఓ ఆర్టీఐ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా తెలిపింది. గీత మహోత్సవంలో పాల్గొన్న వీవీఐపీలకు కానుకగా అందజేసేందుకు ఈ పది భగవద్గీతలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
బయట మార్కెట్‌లో సాధారణంగా రూ. 150-200లకు ’భగవద్గీత’ గ్రంథాలు లభిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం భారీగా ఖర్చుచేసి వీటిని కొనుగోలు చేయడం విమర్శలకు తావిస్తోంది. వీఐపీలకు అందజేసేందుకు ఖరీదైన కాగితంతో తాళపత్ర గ్రంథాల తరహాలో ఉండేలా వీటిని రూపొందించామని, అందుకే ఇంత ఖర్చు అయిందని ఖట్టర్ సర్కారు చెప్తోంది. అంతర్జాతీయ గీత మహోత్సవానికి రూ. 4.32 కోట్లు ఖర్చు చేశామని ఖట్టర్ సర్కారు ఓ ఆర్టీఐ ప్రశ్నకు వెల్లడించగా.. అనధికారికంగా ఈ ఉత్సవానికి రూ. 15 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందని, ప్రజాధనం ఖర్చు చేసే విషయంలో పారదర్శత ఏమాత్రం పాటించడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment