సాక్షి, ఖమ్మం : మధిర గడ్డ పౌరుషాల అడ్డ.. ఇక్కడ ఎవరూ అమ్ముడుపోరు.. ఆత్మాభిమానంతో జీవిస్తారు అని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సోమవారం నామినేషన్ వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. తాను ప్రజల కొరకు మాత్రమే పని చేస్తానని గుత్తేదారుల కోసం కాదని వ్యాఖ్యానించారు. కొంతమంది కాంట్రాక్టర్లు డబ్బు సంచులతో ఇక్కడికి వచ్చి ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పిల్లకాకి నన్ను ప్రశ్నించాడు..!
‘ఈ మధ్య ఒక పిల్లకాకి ఇక్కడకు వచ్చి నేనేం చేశానని ప్రశ్నించాడు. నేను ఏమి చేసానో తెలియాలంటే.. జాలిముడి ప్రాజెక్టు, కట్టలేరు జలాలు, కుదుమూరు- వందనం లిఫ్ట్ ఇరిగేషన్‌లను అడిగితే సమాధానం చెబుతాయి. నువ్వు వచ్చిన ఆర్ఓబీ కూడా నేను కట్టించిందే.. నువ్వు నడిచిన రహదారులు కూడా నా హయాంలో వేయించినవే. ఇక్కడ పొలాల్లో పారె నీళ్లు చెబుతాయి నేను ఏమి చేసానో’ అంటూ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మధిర ప్రజలకు ఏమి చేశారని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తమ సమస్యలను అసెంబ్లీలో చర్చించాల్సిందిగా ప్రజలు తనను ఎన్నుకున్నారని.. కాబట్టి తాను కేవలం వారికోసమే పనిచేస్తానని భట్టి చెప్పుకొచ్చారు.(అహంకారానికి, ఆత్మగౌరవానికి పోటీ)
కాగా ఈ సమావేశంలో భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్, తెలుగుదేశం పార్టీ మధిర ఇంచార్జి డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment