
సాక్షి, హైదరాబాద్ : తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క మల్లు నిరాహార దీక్షకు దిగారు. ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షలో భాగంగా 36 గంటల పాటు ఆయన దీక్ష చేయనున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ఇంచార్జి ఆర్సీ కుంతియా దీక్షను ప్రారంభించగా.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, శ్రీధర్ బాబు, జీవన్‌రెడ్డి, సీతక్క, బలమూరి వెంకట్ తదితర పార్టీ నేతలు దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా అశేష కాంగ్రెస్ శ్రేణుల ఇందిరాపార్కుకు తరలి వచ్చాయి. ఈ క్రమంలో గత కాంగ్రెస్‌తో పాటు మహాకూటమిలో భాగమైన పలువురు టీటీడీపీ నేతలు కూడా ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. టీజేఎస్ కన్వీనర్ కోదండరాం కూడా తన మద్దతు తెలిపారు.
కాగా అధికార టీఆర్‌ఎస్ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..‘శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే.. ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరాలని రాజ్యాంగంలో ఉంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని టీఆర్‌ఎస్ పార్టీ అనుకూల మీడియాలో అని ప్రచారం జరుగుతోంది. ఇది నిజం కాదు. ప్రజలు ఎవరిని గెలిపించినా మేము డబ్బుతో ఆ నాయకులను కొంటామని కేసీఆర్ అనుకుంటున్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు. ఈ విషయం గురించి ప్రజలే ఆలోచించాలని కోరుతున్నా. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వికృత చర్యలను గమనించాలి’ అని భట్టి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment