40 ఏళ్ల ‘బాబు’ చరిత్రంతా నీచమే | Bhumana Karunakar Reddy fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల ‘బాబు’ చరిత్రంతా నీచమే

Published Thu, Mar 1 2018 4:34 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM

Bhumana Karunakar Reddy fires on CM Chandrababu - Sakshi

శిక్షణ తరగతుల్లో ప్రసంగిస్తున్న భూమన కరుణాకర్‌రెడ్డి

అనంతపురం: 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు  వంచన, కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు, నీచ రాజకీయ ఎత్తుగడలతో ఒకరిని మేనేజ్‌ చేయడం తప్ప ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం అనంతపురంలో వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్ల రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. 1978లో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తానే ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

భూమన ఇంకా ఏం మాట్లాడారంటే...  
‘‘నాది 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజల కోసమే పుట్టాను, వారి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించడం లేదు. ప్రజల కోసం నాలాగా ఆలోచించేవారు ఎవరూ లేరు. ప్రధాన మంత్రులనే తయారు చేసిన గొప్ప రాజకీయ నాయకుడినని పతాక శీర్షికలతో సీఎం చంద్రబాబు తన ఎల్లో మీడియాలో రాయించుకున్నారు. అంతకంటే ఎక్కువగా పచ్చ మీడియా బాకాలు ఊదింది. నిజంగా చంద్రబాబు మూలాలు ఎలాంటివో నాకు తెలుసు. ఆయన కంటే నేను నాలుగైదేళ్లు చిన్నవాడిని. నేను కూడా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నా. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో ఆర్‌ఎస్‌యూ ప్రారంభమైంది. ప్రారంభ సభ్యుల్లో నేనూ ఒకడిని. ఆర్‌ఎస్‌యూ నడపడానికి 1974 డిసెంబర్‌ 8న మేము ఒక సినిమాను బెనిఫిట్‌ షోగా ప్రదర్శించేందుకు టికెట్లను రూ.2 ధర చొప్పున విక్రయించాం. ఇదే సమయంలో ఎ–బ్లాకులో ఉంటున్న చంద్రబాబు గదికి వెళ్లి టికెట్‌ కొనాలని కోరితే ఆయన వద్ద డబ్బులుండి కూడా ఇవ్వడానికి మనస్కరించలేదు.

అలాగని లేదని చెప్పే ధైర్యం లేకపోయింది. అదే గదిలో నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో నుంచి రూ.2 దొంగిలించి నా చేతికి ఇచ్చారు. 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు పునాది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ చాలు. అలాగే 1977లో పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. చిత్తూరు స్థానానికి రాజగోపాల్‌నాయుడు ఎన్నికల్లో నిలబడ్డారు. చంద్రగిరి నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. చంద్రబాబే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. జీపు ఇచ్చి 200 లీటర్ల పెట్రోల్‌ను బ్యారెల్‌ నిండా నింపి, చంద్రగిరి నియోజకవర్గమంతా తిరిగి రమ్మని చెబితే మరుసటి రోజు ఉదయమే అన్నా పెట్రోల్‌ మొత్తం అయిపోయిందని చెప్పాడట చంద్రబాబు. ఈ పెట్రోల్‌ను కాంగ్రెస్‌ పార్టీ నేత వీరరాఘవులు నాయుడికి చెందిన బంకులో అమ్మేశాడట! ఈ విషయాన్ని స్వయంగా వీరరాఘవులునాయుడే నాకు చెప్పాడు. చంద్రబాబు మూలాలు ఇంత నీచంగా ఉంటే నీతి నిజాయితీకి పునాదిలా ఉన్నాడంటూ పతాక శీర్షికలతో రాయడం బాధాకరం.

అదే సమయంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తగా జనం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచనలతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చారు. 30 ఏళ్ల పాటు తెలుగు జాతిని ఉర్రూతలూగించారు. పోరాటాలు, ఉద్యమాలు, సమున్నతమైన వ్యక్తిత్వంతో గొప్ప నాయకుడిగా ఎదిగారు. చంద్రబాబుకు, వైఎస్‌ రాజశేఖరరెడ్డికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వైఎస్సార్‌సీపీకి సిద్ధాంతాలు లేవని చంద్రబాబు అంటున్నారు. మా పార్టీకి మహత్తరమైన సిద్ధాంతం ఉంది. రాజశేఖరరెడ్డి జీవితమే వైఎస్సార్‌సీపీ భావజాలం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు ప్రజాద్రోహ రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవాలు తెలియనని వారికి చంద్రబాబు ఎలాంటి అబద్ధాలైనా చెబుతారు. చంద్రబాబులాగా నీచ రాజకీయాలు కాకుండా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఆరేళ్లు గడువు ఉన్నా రాజీనామా చేస్తేనే తన పార్టీలోకి చేర్చుకోవడం జగన్‌ పాటిస్తున్న నైతిక విలువలకు నిదర్శనం. చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను రూ.కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసి దిగజారుడు రాజకీయాలు చేశారు. వ్యక్తిత్వం గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదం ఉంది. కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో అబద్ధాలు చెప్పడమే చంద్రబాబు నైజం’’ అని భూమన నిప్పులు చెరిగారు.

జనం దీవెనలతోనే జగన్‌ అధికారం చేపడతారు
ప్రజల కోసం అహర్నిశలూ పోరాడుతున్న వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని భూమన అన్నారు. ఆయన అణిగిమణిగి ఉండింటే 8 ఏళ్ల కిందటే సీఎం అయ్యేవారన్నారు. ప్రజల దీవెనలతోనే అధికారం చేపట్టాలని జగన్‌ భావిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి, ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా పరిశీలకులు వైఎస్‌ కొండారెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కిష్టప్ప, హిందూపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు శంకర నారాయణ పాల్గొన్నారు.

నవ్విపోదురుగాక...
‘‘ఒక పత్రికలో చంద్రబాబు ఇంటర్వ్యూ చూశాను. వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తానే ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించానని చంద్రబాబు చెప్పాడు. వాస్తవం ఏమిటంటే మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబుకు స్థానం కల్పించేలా రాజశేఖరరెడ్డి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పదవి ఇప్పించారు. ఇలాంటి చంద్రబాబా.. రాజశేఖరరెడ్డికి టికెట్‌ ఇప్పించేది? ఎవరైనా వింటే నవ్విపోతారు. వాస్తవాలు తెలియనివాళ్లు, అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి అవగాహన లేని వారు చంద్రబాబు మాటలు వింటే ఇవన్నీ నిజమేనేమో అని భ్రమ పడుతారు. చంద్రబాబు నోట అబద్ధాలు మినహా మరో సత్యం రాని పరిస్థితి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement