సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అప్పు ఇవ్వడం అంటే.. విజయ్ మాల్యాకు బ్యాంకులు అప్పు ఇచ్చినట్లేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చార్మినార్ బ్యాంక్, కేశవ రెడ్డి, అగ్రిగోల్డ్ సంస్థల్లా చంద్రబాబు కూడా బోర్డు తిప్పేయగలరని మండిపడ్డారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చట్టం చెబుతోందన్నారు. కానీ రాజధాని నిర్మాణ పేరిట చంద్రబాబు ప్రభుత్వం రూ. లక్షా 20 వేల కోట్ల పెనుభారాన్ని ప్రజలపై పడేసిందని విమర్శించారు. అప్పు చేసి ఏమైనా అభివృద్ధి చేశారా? అంటే అదీ లేదని, అమరావతిలో వెతికినా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. అమరావతి అనే పీఠానికి చంద్రస్వామి అనే పీఠాధిపతిగా మారి దొంగల కంటే దారుణంగా దోచుకోవడం దాచుకోవడం చేస్తున్నారని మండిపడ్డారు.
అలాంటి వ్యక్తి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద, ఆయన వ్యక్తిత్వం మీద సమాజం వినలేని మాటలు మాట్లాడటం అందరూ గమనిస్తున్నారని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క రోజైనా చంద్రబాబు నిజాయితీగా బతికారా? అని ప్రశ్నించారు. ‘శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్‌ఎస్‌యూలో నేను వ్యవస్థాపక సభ్యుడిని. చక్రపాణి అనే సినిమాను ఆర్‌ఎస్‌యూ కోసం ప్రత్యేకంగా బెనిఫిట్ షో వేశారు అప్పట్లో. తన టికెట్ కోసం చంద్రబాబు స్నేహితుడి ప్యాంట్ జేబులో నుంచి రూ. 2 వేలు దొంగతనం చేసిన విషయం నాకు తెలుసు. ఒక దొంగతనంతోనే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
ఓ నాటికలో హీరో పాత్ర కోసం అయ్యవారికి వేరుశెనక్కాయల సంచి లంచం ఇచ్చిన చరిత్ర చంద్రబాబుది. అవి కూడా పక్కింటి పొలం నుంచి దొంగతనంగా తెచ్చి ఇచ్చారు. ఇదే నాటికలో హాస్య పాత్ర వేసిన ఓ వ్యక్తి ఇంకే బతికేవున్నారు. ఆయనే ఈ విషయాన్నే నాతో చెప్పారు. చిత్తూరు ఎంపీగా రాజగోపాల్‌నాయుడు 1977లో పోటీ చేస్తూ జీపు, 200 లీటర్ల పెట్రోల్ బారెల్‌ను వెంటపంపితే చంద్రబాబు పెట్రోల్‌ను బంకులో అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఇదీ మీ జీవితం.. ఇలా పెరిగిన మీరు వ్యవస్థలను మేనేజ్ చెయ్యగలరు.
ఎంతకైనా దిగజారే మీరు.. గొప్పలు చెప్పించుకోగలరు. ఎదగడం కోసం నీచపు ఎత్తుగడలు వేసి అడ్డం వచ్చిన వారిని తొలగించుకోగలరు. ఎన్‌టీఆర్ ఎపిసోడ్ ఇందుకు చక్కని ఉదాహరణ. కానీ ఇప్పుడు మీకు భజన చేసే ప్రసార మాధ్యమాలు చాలా వచ్చాయి. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి. కన్నీళ్లతో ఎన్ని దాష్టీకాలు చేసినా.. సామాజిక మాధ్యమాల ద్వారా కొట్టుకుపోక తప్పదు. మీ గ్రాఫ్ పడిపోతున్నది కాబట్టి జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద దాడి చేస్తున్నారు.
చంద్రబాబు ఏడిస్తే.. దయ్యాలు, భూతాలు ఏడ్చినట్టే. మొసళ్ళ దగ్గర నుండి కన్నీరు అరువు తెచుకున్నట్టే. నేను చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఇవి నిజాలు అవునో కాదో చంద్రబాబు సమాధానం చెప్పాలి.’
Comments
Please login to add a commentAdd a comment