
సాక్షి, బెంగళూరు: గత నాలుగు రోజులుగా క్షణ క్షణానికి మారుతున్న కన్నడ రాజకీయాలు హైదరాబాద్ నుంచి తిరిగి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాల కసరత్తు అనంతరం క్యాంప్ రాజకీయాలు మరింత వేడిగా మారాయి. కర్ణాటక పీఠం దక్కించుకోవడం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా పరిణమించింది. దీంతో ఎవరు వ్యూహాలు పై చేయి సాధించనున్నాయి. కర్ణాటక పీఠం ఎవరికి దక్కనుంది? విజేత ఎవరు? ఇపుడిదే బిగ్ డిబేట్. ఈ రోజు(శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న బలపరీక్ష నేపథ్యంలో బెంగళూరు విధాన సౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
మరోవైపు సీనియర్ సభ్యులను పక్కన పెట్టి ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య ఎన్నికపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ఉదయం 10. 30 నిమిషాలకు సుప్రీంలో విచారణ జరగనుంది. దీంతో సుప్రీం నిర్ణయంపై మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అసెంబ్లీలో బలనిరూపణ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసేందుకు రడీ అవుతున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు బలపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు బెంగళూరులోని హోటల్ షాంఘ్రిలాకి చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎమ్మేల్యేలకు దిశా నిర్దేశనం అనంతరం అసెంబ్లీకి పయనమవుతారు.
ఇది ఇలా ఉంటే కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్ష సందర్భంగా నెంబర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయనీ తమదే విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. బలపరీక్షలో బీజేపీకి భంగపాటు తప్పదని, ఫ్లోర్ టెస్ట్‌లో తాము మెజారిటీ నిరూపించుకుంటామని చెప్పారు. విజయం తమదేనని కాంగ్రెస్ మరో సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment