బిహార్ సీఎం నితీశ్ కుమార్ (పాత ఫొటో)
పట్నా : యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ, జేడీ(యూ)ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు సీఎం నితీశ్ కుమార్ హాజరుకాలేదు. యోగా డే ఒక పబ్లిసిటీ స్టంట్ అని గతంలో వ్యాఖ్యానించిన నితీశ్ కుమార్.. ఈరోజు(జూన్ 21) కూడా ఇంట్లోనే యోగా చేశారు. ఈ విషయమై జేడీ(యూ) రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ మాట్లాడుతూ... ‘ప్రతీ భారతీయుడు యోగా చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ మాటల్ని మేము గౌరవిస్తాం. అయినా జనాల మధ్య ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. మా పార్టీ కార్యకర్తలంతా రోజూ యోగా చేస్తారు. ఇందులో విశేషమేముంది’ అంటూ వ్యాఖ్యానించారు.
వాళ్లను ఆహ్వానించలేదు...
పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, రామ్ కృపాల్ యాదవ్‌తో పాటు నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు బీజేపీ మంత్రులు పాల్గొన్నారని బీజేపీ నేత కృష్ణ కుమార్ రిషి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా జేడీ(యూ) నేతలకు ఆహ్వానాలు పంపలేదని ఆయన మీడియాకు తెలిపారు.
జేడీయూ నేతలకు ఆహ్వానాలు పంపకపోవడంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు స్పందిస్తూ.. ‘ఎన్డీయే కూటమిలో అసలేం బాగాలేదంటూ’ వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రతిపక్షం వ్యాఖ్యల్ని ఖండించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యోగా చేయడాన్ని ఇష్టపడతారు. యోగా దినోత్సవాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని’ ఆయన హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment